తెలంగాణ ధ్వని : హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. చత్తీస్‌ఘడ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం రక్తపాతం సృష్టిస్తుందని ఆయన ఆరోపించారు. “చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ మరోవైపు ఎన్‌కౌంటర్ల ద్వారా అమాయక గిరిజనులను బలి తీసుకోవడం దారుణం” అని మండిపడ్డారు.
మావోయిస్టులు, టెర్రరిస్టులను ఒకేలా చూడకూడదని, వెంటనే ‘ఆపరేషన్ కాగర్’ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని సూచించారు.తదుపరి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోసి, ధర్నా చౌక్‌ను ఎత్తేయడమంటూ అన్యాయాలను గుర్తు చేశారు.
అక్రమ కేసులు నమోదు చేసి ప్రజలను హింసించారని విమర్శించారు. తమ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించిందని, అధికారులను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల కాలంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. రైతుల రుణ మాఫీ, కుల గణన, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత, పెట్టుబడుల ఆహ్వానం, సన్నాలకు 500 రూపాయల బోనస్, ఉచిత సన్న బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను ఆయన గర్వంగా ప్రస్తావించారు. పేద ప్రజల పట్ల ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదని కడియం శ్రీహరి విమర్శించారు. “బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలి” అంటూ హితవు పలికారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక