telanganadwani.com

OperationSindoor

ఆపరేషన్ సిందూర్ ప్రభావం దేశవ్యాప్తంగా 300 విమానాలు రద్దు

తెలంగాణ ధ్వని : ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో గగనతలంపై కేంద్రం ఆంక్షలు విధించడంతో బుధవారం ఉదయం 5.29 గంటల నుంచి ఈ నెల 10 వరకూ దేశవ్యాప్తంగా 300పై చిలుకు విమాన సర్వీసులు రద్దయ్యాయి.

శ్రీనగర్‌, లేహ్‌, జమ్ము, అమృత్‌సర్‌, సిమ్లా సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని 25 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు. మరోవైపు, పాకిస్థాన్‌ మీదుగా వెళ్లే సుమారు 25 విమాన సర్వీస్‌ రూట్లను మూసేసినట్లు కేంద్రం వెల్లడించింది.

దీంతో.. వివిధ విమానాశ్రయాల నుంచి సర్వీసులను రద్దు చేసినట్టు పలు విదేశీ, స్వదేశీ విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులు బయలుదేరడానికి ముందు రియల్‌టైం అప్‌డేట్స్‌ చెక్‌ చేసుకోవాలని అభ్యర్థించాయి.

మరోవైపు.. పాకిస్థాన్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపేశామని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది.
తాజా ఆంక్షల నేపథ్యంలో బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి బయలుదేరే ప్రయాణికులు తమ ఎయిర్‌లైన్స్‌ నుంచి వచ్చే అప్‌డేట్స్‌ చెక్‌ చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.

ఆపరేషన్‌ సిందూర్‌కు తోడు.. హైదరాబాద్‌లో జరిగే ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు.

గగనతల ఆంక్షలతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉత్తర భారతంలోని ఆరు ప్రాంతాలకు వెళ్లే 20 విమానాలు రద్దు కాగా, 22 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మిస్‌ వరల్డ్‌ పోటీల నేపథ్యంలో విమానాశ్రయంలో అడుగడుగునా సీఆర్పీఎఫ్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

భద్రత కారణాల రీత్యా.. నిర్దేశిత సమయానికి కంటే ముందుగానే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు. చెకిన్‌లో కొంత ఆలస్యం జరుగనుండటంతో ఓపిగ్గా వ్యవహరించాలని ప్రయాణికులను కోరారు.

 

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top