తెలంగాణ ధ్వని : ఆడుగడుగునా ఓ చెట్టు చొప్పున ఆరువందల ఎకరాల్లో కనిపించే మామిడితోట, రెండువందల రకాల మామిడిపండ్లు, పండుకో రుచి… ఆసియాలోనే అతిపెద్దదైన మామిడి తోటగా ప్రసిద్ధి.
ఈ ప్రత్యేకతలన్నీ ‘ధీరూభాయ్ అంబానీ లఖీబాగ్ అమ్రాయీ’ లో కనిపిస్తాయి. వేసవిలో ఏటా ఆరువందల టన్నుల మామిడి పండ్లను పండిస్తూ, కోట్లల్లో ఆదాయాన్ని అందుకుంటున్న ఈ తోటను రిలయెన్స్ సంస్థ ప్రారంభించడం వెనక ఆసక్తికరమైన కథే ఉంది.
వ్యాపారంలో లాభాలే కాదు, నష్టాలూ ఉంటాయి. అప్పుడప్పుడూ సమస్యలూ ఎదురవుతాయి. అయితే వాటిని సరైన దిశగా పరిష్కరించడంలోనే ఓ వ్యాపారవేత్త ప్రతిభ దాగుంటుంది.
అలాంటి పరిస్థితే ఓసారి రిలయన్స్ సంస్థకు ఎదురైంది. అది 1997. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న తమ చమురు శుద్ధి కర్మాగారంవల్లకాలుష్యం సమస్య పెరగడంతో కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు తగినట్లుగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పలేదు.
అప్పుడు రిలయన్స్ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. అదే ఇప్పుడు గుర్తింపును తెచ్చిపెట్టింది. ఏటా ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్నీ అందిస్తోంది.
చుట్టుపక్కల ప్రాంతాలవారికీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఆ పరిష్కారం పేరే ‘ధీరూభాయ్ అంబానీ లఖీబాగ్ అమ్రాయీ’. ఒక్కమాటలో చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న మామిడితోట పేరు అది.
నిజానికి ఈ తోట ఉన్న ప్రాంతం ఒకప్పుడు బీడు భూమి. దాన్ని అలాగే వదిలేయకుండా మామిడితోటగా మార్చింది రిలయన్స్ సంస్థ. కట్ చేస్తే, అది ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మామిడితోటగా రికార్డును సొంతం చేసుకుంది.
ఆరువందల ఎకరాల్లో సుమారు లక్షా ముప్పై వేలకు పైగా మామిడిచెట్లతో కనిపిస్తుంది. దాదాపు రెండువందల రకాల మామిడిపండ్ల వెరైటీలు ఉండే ఈ తోట నుంచి ఏటా ఆరువందల టన్నుల్లో దిగుబడి వస్తుంది.
ఆ పండ్లన్నింటినీ ఆన్‌లైన్‌తోపాటు తమ స్టోర్ల ద్వారా దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తోంది రిలయన్స్ సంస్ట.ఏటా వందకోట్ల రూపాయల వరకూ టర్నోవరునూ అందుకుంటోంది.
ఇక్కడ దొరికే మామిడి వెరైటీల్లో కేసర్, ఆల్ఫోన్సో, రత్న, సింధు, నీలమ్, ఆమ్రపాలి వంటి దేశీయ రకాలే కాకుండా… టామీ అట్కిన్స్, కెంట్, లిలీ, మాయా… వంటి విదేశీరకాలూ ఉంటాయి.లక్షల సంఖ్యలో చెట్లను పెంచుతూ అత్యాధునిక పద్ధతుల్లో సాగు చేసే ఈ మామిడి తోట విశేషాలు ఇంత మాత్రమే కాదు.
ఈ తోటలో వ్యవసాయం చేసే విధానమే కాస్త భిన్నంగా ఉంటుంది. ఇంచుమించు అయిదువందలమంది ఉద్యోగులు పనిచేసే ఈ తోటలో డీశాలినేషన్, డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిగేషన్, వాటర్ హార్వెస్టింగ్…
వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తారు. ఉదాహరణకు డిశాలినేషన్‌ను తీసుకుంటే… నీటిలో ఉండే లవణాలూ ఇతర కలుషితాలను ముందుగానే తొలగించి, కేవలం స్వచ్ఛమైన నీటినే చెట్లకు ఉపయోగిస్తారు.
ఇక, డ్రిప్ ఇరిగేషన్ అంటే… బిందు సేద్యం. ప్రతి మొక్కకూ బొట్టుబొట్టు చొప్పున నీరు అందుతుంది. దీనివల్ల నీటి వృథా తగ్గడమే కాకుండా, పంటనష్టాన్నీ అరికట్టొచ్చు. ఫెర్టిగేషన్‌లో రసాయనాలు లేని ఎరువుల్ని నీటిలోనే కలిపి చెట్లకు అందిస్తారు.
దీనివల్ల చెట్టు వేళ్ల నుంచి ఎరువులు అందుతాయట. ఇవి కాకుండా, వాన నీటి సంరక్షణ, ఎలాంటి రసాయనాలూ లేని క్రిమిసంహారకాలూ, ఎరువుల్నే వాడటం… ఇలా ఎన్నో జాగ్రత్తల్ని తీసుకుంటారు.
ఇక్కడి సిబ్బంది. వీటన్నింటివల్లే ఎలాంటి తెగుళ్ళూ లేకుండా ప్రతి పండూ ఎంతో రుచిగా పండుతుందనీ, టన్నుల కొద్దీ దిగుబడి వస్తుందనీ చెబుతారు. ఇప్పుడిది ఎంతోమంది రైతులకే కాకుండా శాస్త్రవేత్తలకూ పరిశోధన క్షేత్రంగానూ పేరుపొందింది.
రిలయన్స్ సంస్థ ఇవన్నీ చేస్తూనే… ప్రతిఏటా సుమారు లక్ష మామిడి మొక్కల్ని స్థానిక రైతులకు పంచిపెడుతూ, ఆధునిక వ్యవసాయపద్ధతుల్లో శిక్షణ ఇస్తూ.. వాళ్లకూ ఆదాయమార్గాలను చూపుతోంది. తద్వారా జామ్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచుతోంది.
వేసవిలో ప్రపంచవ్యాప్తంగా పర్యటకుల్ని ఆకట్టుకుంటున్న ఈ మామిడితోటను నీతా అంబానీ స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం.!
రిపోర్టర్. ప్రతీప్ రడపాక