తెలంగాణ ధ్వని న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి నాలుగు కీలక పథకాలను ప్రారంభించనుంది. అయితే ఈ పథకాల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామ, వార్డు సభలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల విడుదల చేసిన లిస్టులో పేర్లు లేకపోవడంతో కొందరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గ్రామసభల లిస్టు కేవలం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లతో ఉంటుందని, ఇది తుది లబ్ధిదారుల లిస్టు కాదని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసి పథకాలు అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా ఉంటుందని, ఎవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక