రేషన్‌కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఉచితం.
మధ్యవర్తుల అక్రమ లాభాలు తగ్గుతాయి.
పేదలకు నాణ్యమైన బియ్యం అందుబాటులోకి వస్తుంది.
బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గే అవకాశం.
తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, ఉగాది పండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రజలకు అందిస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో నేరుగా మెరుగైన సన్నబియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని ఉగాది రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మటంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజ అనంతరం ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం రేషన్ ద్వారా అందిస్తున్న బియ్యం తినడానికి అనువుగా లేదని, దాదాపు 85% మంది ప్రజలు రేషన్ షాపుల నుంచి దొడ్డు బియ్యం తీసుకుని, బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సన్నబియ్యం కొనే పరిస్థితి ఉంది. దీనివల్ల మధ్యవర్తులు భారీ లాభాలను పొందుతున్నారు. ప్రభుత్వం దీనిని అరికట్టేందుకు నేరుగా సన్నబియ్యాన్ని అందించాలని నిర్ణయించింది.
సీఎం రేవంత్ రెడ్డి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మొదటిగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రారంభించి, తర్వాత అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు.
ఈ నిర్ణయంతో పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు, రాష్ట్రంలో ఆహార భద్రతను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉచితంగా సన్నబియ్యం అందించడం ద్వారా పేదలు నేరుగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక