telanganadwani.com

ఎమ్మెల్సీ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’ బీజేపీదే – బండి సంజయ్

తెలంగాణ ధ్వని: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’గా అభివర్ణించారు. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల ఫలితమే గుణపాఠమన్నారు. ముస్లిం ఓట్లు ఏకమై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించగా, హిందూ సమాజం కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఏకమై ‘‘రంజాన్ గిఫ్ట్’’గా కాంగ్రెస్‌కు ఓటమి ఇచ్చిందని వ్యాఖ్యానించారు.  బీజేపీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పిన బండి సంజయ్, బీజేపీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబ్బు పంచి గెలవాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టారని ఆరోపించారు. గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా డబ్బులు పంపిన వారి లావాదేవీలన్నీ బయటపెడతామని హెచ్చరించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఘన విజయం సాధించారని, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ వేసిన రాజకీయ ఎత్తుగడలు ఫలించలేదని పేర్కొన్నారు. ఈ విజయం బీజేపీ శ్రమ, మోదీ నాయకత్వం, ప్రజల మద్దతు ఫలితమని అన్నారు.  కాంగ్రెస్ ప్రజాదరణ ఉందని నమ్మితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. ఇకపై రాష్ట్రంలోని ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణలో పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధ్వజమెత్తుతూ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి రూ.4,000 అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ పీఆర్సీ, డీఏలు, రైతుల సంక్షేమ హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు.

ఓటుకు డబ్బులు పంపిణీపై, ఓటుకు రూ.5,000 వరకూ యూపీఐ ద్వారా చెల్లింపులు జరిగినట్లు ఆరోపించారు. అక్రమంగా డబ్బు పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అంతేకాదు, ఒక వర్గానికి మాత్రమే మద్దతుగా వ్యవహరించే కాంగ్రెస్‌పై హిందూ సమాజం తీవ్ర అసంతృప్తితో ఏకమై బీజేపీకి మద్దతు ఇచ్చిందని తెలిపారు. బీజేపీ ఇకపై కూడా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

 

రిపోర్టర్: కిరణ్ సంగ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top