మదర్ రోబో: మిగతా రోబోల పనిని సమన్వయం చేయడంతో పాటు పరిసరాలను స్కాన్ చేస్తుంది.
రాళ్లను తొలగించే రోబో: సొరంగ మార్గాన్ని క్లియర్ చేయడానికి పెద్ద రాళ్లను తుక్కు చేస్తుంది.
మట్టిని తవ్వే రోబో: గట్టిగా ఉన్న నేలను తొలగించి కార్మికులకోసం మార్గం సుగమం చేస్తుంది.
బురదను తొలగించే రోబో: లోపల నిల్వ ఉన్న నీరు, బురదను బయటకు పంపుతుంది.
తెలంగాణ ధ్వని : మహబూబ్‌నగర్ జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన భూగర్భ విపత్తులో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహాయక చర్యలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు నాలుగు రోబోలు రంగంలోకి దిగుతున్నాయి.రోబోలు రంగంలోకి దిగేందుకు రూ. 4 కోట్ల నిధులు మంజూరు చేయగా, ఈ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్స్ సంస్థ స్వీకరించింది. మంగళవారం ఒక మదర్ రోబోను టన్నెల్లోకి ప్రవేశపెట్టగా, బుధవారం నాటికి మిగతా మూడు రోబోలు చేరుకుంటాయి.
సహాయక బృందాలు డీ1, డీ2 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నాయి.డీ2 ప్రాంతంలో తవ్వకాలు దాదాపు పూర్తయినట్లు సమాచారం.బుధవారం నాటికి కార్మికుల ఆచూకీ లభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.క్యాడవర్ డాగ్స్ సహాయంతో లోపల మానవ ఉనికి గూర్చి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహాయక చర్యలను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహాయ చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించింది.
కుటుంబ సభ్యుల్లో ఆశ & ఆందోళన:
తమ కుటుంబ సభ్యులు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నప్పటికీ, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండటంతో గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
రక్షణ బృందాలు అన్ని జాగ్రత్తలతో రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని అధికారులు భరోసా ఇచ్చారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక