telanganadwani.com

Dasyam Vinay Bhaskar

కార్మిక హక్కుల కోసం బీఆర్ఎస్ ధ్వజం – కేంద్ర కార్మిక చట్టాల రద్దు కోసమే మా పోరాటం..

  • అంగన్వాడీ, ఆశా వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
  • ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి రెండు పీఆర్సీలను అమలు చేయాలని కోరారు.
  • బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు అమలుచేయాలని కోరారు.
  • ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
  • గిగ్ వర్కర్స్‌కు బీమా సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
  • ఔట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు రూ. 25,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
  • ఎన్ఆర్ఈజిఏ ఉపాధి హామీ పనిదినాలను 150కి పెంచి రోజుకూలి రూ. 350 ఇవ్వాలని కోరారు.
  • గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పారు.

తెలంగాణ ధ్వని  : బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు కేంద్రం తెచ్చిన నాలుగు కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

బుధవారం రోజున హనుమకొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల నేతలతో కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మే నెలను కార్మిక మాసంగా జరుపుతూ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్నామని తెలిపారు.

ఈ ఏడాది కూడా మే నెల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక మాసోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, వారి హక్కుల కోసం ఉద్యమాల నిర్వహణ జరగనున్నట్లు చెప్పారు.

కరోనా సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం అని చెప్పారు.

కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయబడిందని, బీమా, నైపుణ్య శిక్షణ, వైద్య శిబిరాలు వంటి సేవలు అందించారని తెలిపారు.

ప్రతి సంవత్సరం మే డే రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించడం, కార్మిక కుటుంబాల కోసం వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

మే నెలలో అన్ని కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మే 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి కార్యాచరణను చేపడతామని చెప్పారు.

ఈ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు నాయిని రవి, ఎంజాల మల్లేశం, కాటాపూర్ రాజు, రవీందర్ రెడ్డి, తేలు సారంగపాణి, రఘు, అరుణ్, జయరాం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top