తెలంగాణ ధ్వని : శ్రీవారి దర్శనార్థం తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది.
భక్తులకు ఉచితంగా సేవలు అందించేందుకు 20 ఎలక్ట్రిక్ బస్సులను తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి వరకు నడపాలని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించారు.
ఇప్పటికే ధర్మరథ బస్సులు సేవలందిస్తున్నా, భక్తుల సంఖ్యకు అనుగుణంగా లేకపోవడంతో ప్రయాణంలో అసౌకర్యాలు ఏర్పడుతున్నాయి. దీనిని లాభంగా మార్చుకునే ప్రయత్నంగా కొంతమంది జీపు, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు మళ్లీ భారం వేయకుండా, దాతల సహకారంతో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని తితిదే యోచిస్తోంది. త్వరలో జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక