- ట్రాఫిక్, పార్కింగ్ సక్రమంగా నిర్వహణ.
- కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో శరవేగం ఏర్పాట్లు.
- భక్తుల కోసం షటిల్ బస్సులు, తాగునీరు, శుభ్రత.
తెలంగాణ ధ్వని : సరస్వతి పుష్కరాల వేళ కాళేశ్వరం ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు.
వరద నీరు ముంచెత్తిన పుష్కరఘాట్ పరిసరాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి, తగిన సూచనలు జారీ చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా బస్టాండ్ నుంచి పుష్కరఘాట్ వరకు ప్రత్యేక షటిల్ బస్సులు నడిపిస్తున్నారు.
వర్షాల ప్రభావంతో తడిసిపోయిన టెంట్సిటీ ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలు బలోపేతం చేయడంతో పాటు, దేవాలయ ప్రాంగణానికి చేరుకునే రహదారులను సరిచేసే పనులు వేగంగా సాగుతున్నాయి.
తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాల్లో అధికారులు నిరంతర సేవలు అందిస్తూ సౌకర్యాల కల్పన కోసం రేయింబవళ్ళు పని చేస్తున్నారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ, భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్టంగా వ్యవస్థను అమలు చేస్తున్నారు.
ఈ చర్యలపై భక్తుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కలెక్టర్ మరియు ఎస్పీ నేతృత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. అదే విధంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ గారు గురువారం ఈవో కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, తగిన సూచనలు జారీ చేశారు.
ఆమె కూడా కలెక్టర్, ఎస్పీ తీసుకుంటున్న చర్యలను మెచ్చుకున్నారు.ఈ విస్తృత ఏర్పాట్లు పుష్కరాల సందర్భంగా భక్తులకు సులభంగా దర్శనం, స్నానాది సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న ప్రత్యేక ప్రయత్నంగా నిలుస్తున్నాయి.
పాలకులు, అధికారులు సమన్వయంతో ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈ దృక్పథం పట్ల భక్తులు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక