తెలంగాణ ధ్వని: కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లే దిశగా కీలక ప్రకటనలు చేశారు.
మే 5న కాగజ్‌నగర్‌లో జరిగిన సభలో పాల్గొన్న ఆయన, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ఆదివాసుల చరిత్ర కలిగిన ప్రత్యేక జిల్లా అని ప్రశంసించారు.
పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా గ్రామాలకు రహదారి కనెక్టివిటీ కల్పిస్తున్నామని తెలిపారు. Telanganaలో ఇప్పటికే 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని, భవిష్యత్తులో 2 లక్షల కోట్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
అదిలాబాద్ నుంచి బేల వరకు 491 కోట్లతో, ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల మార్గంలో 5,000 కోట్లతో 132 కిమీ నూతన రహదారులు మంజూరయ్యాయని వెల్లడించారు.
జగిత్యాల నుంచి కరీంనగర్ రహదారి త్వరలో ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నీరు, విద్యుత్, రవాణా కీలకమని, వాటికి ప్రాధాన్యతనిస్తూ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి 17 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, తెలంగాణలో గ్రీన్ వే పనులు 4,500 కోట్లతో కొనసాగుతున్నాయని తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే ఈ హైవేలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తాయని, రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని గడ్కరీ పేర్కొన్నారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక ..