telanganadwani.com

CMRevanthReddy

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

మహిళా శక్తి పథకానికి ప్రాధాన్యత.

జనగామ జిల్లా శివునిపల్లిలో ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి.

ఘనపూర్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఘనపూర్‌లో రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ స్థాయి కార్యాలయ కాంప్లెక్స్ కు శంకుస్థాపన

జనగామ జిల్లా మహిళలకు మహిళా శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-2లో భాగంగా ఘనపూర్ కాలువ సీసీ లైనింగ్ పనులకు శ్రీకారం

750 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు – స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక ముందడుగు.

స్టేషన్ ఘనపూర్ బహిరంగ సభలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు.

తెలంగాణ ధ్వని : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన, జిల్లాలో పలు సంక్షేమ, రోడ్డు నిర్మాణ, విద్యా, వైద్య, గృహ, సాగు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు సుస్థిర అభివృద్ధి అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి మహిళా సాధికారితపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళాశక్తి పథకం కింద రూ.102.1 కోట్లతో మంజూరైన ఏడు ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మహిళా శక్తి’ స్టాళ్లను సందర్శించిన సీఎం, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

విద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పలు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.200 కోట్ల వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్ ను ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలను అందించేందుకు ఈ స్కూల్‌ను సమకాలీన సదుపాయాలతో నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా, రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

జనగామ జిల్లాలో ఆరోగ్య సేవలను మరింత అభివృద్ధి చేయడానికి రూ.45.5 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ఈ ఆస్పత్రి అత్యాధునిక వైద్యసదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనుంది.

సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.12.9 కోట్లతో గోవర్ధనగిరి – చర్లతండా రహదారి నిర్మాణం చేపట్టారు. అదనంగా, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ డివిజనల్‌ స్థాయి ఆఫీస్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నారు.

అవాస సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.25.6 కోట్లతో 750 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. సీఎం మాట్లాడుతూ, పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2లో భాగంగా రూ.148.76 కోట్లతో ఆర్‌ఎస్‌ ఘనపూర్‌ ప్రధాన కాలువ సీసీ లైనింగ్‌ పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.

బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

శివునిపల్లిలో జరిగిన ప్రజాపాలన బహిరంగ సభలో సుమారు 50,000 మంది ప్రజలు హాజరయ్యారు. వేసవి వేడిమిని దృష్టిలో ఉంచుకుని సభ ప్రాంగణంలో జర్మన్ టెక్నాలజీ టెంట్లు ఏర్పాటు చేశారు. సభలో సీఎం మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “కేసీఆర్ ఫామ్ హౌస్‌లో క్యాప్సికమ్ పండించి లక్షలు సంపాదిస్తున్నారని అంటున్నారు. ఆ టెక్నిక్‌ను నిరుద్యోగ యువతకు చెప్పండి. వాళ్లూ సంపాదించుకోగలరు కదా!” అంటూ సెటైర్ వేశారు.

అంతేకాదు, “రూ.58 లక్షల జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్‌లో పడుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, డాక్టర్లు ఇలా చేస్తే జీతాలు వస్తాయా? రాష్ట్రాన్ని పాలించాల్సిన వ్యక్తి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్‌కు పరిమితమైతే ప్రజలు ఏమనుకుంటారు?” అని నిలదీశారు.

జాతిపిత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం, “జాతిపిత అనిపించుకోవాలంటే త్యాగం చేయాలి, ప్రజా సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేయాలి. మహాత్మా గాంధీ నిరాడంబరంగా జీవించారు. కానీ కేసీఆర్ వేల కోట్లు దోచుకుని, టీవీలు, పేపర్లు పెట్టుకుని తనను తాను జాతిపితగా ప్రకటించుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యపడుతుంది?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జనగామ జిల్లా అభివృద్ధి కోసం మరిన్ని ప్రాజెక్టులు తీసుకువస్తామని సీఎం హామీ ఇచ్చారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top