తెలంగాణ ధ్వని : వరంగల్ మహానగరంలో జెఎస్ఎమ్ కాలనీలో నెలకొన్న వరదనీటి నిల్వ సమస్యపై 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రత్యేక దృష్టి సారించారు. ఉర్సు చెరువు మత్తడి నుండి వరదనీరు ప్రవహించి, కాలనీలో నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం కాలనీ వాసుల వినతిని స్వీకరించిన రవి, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డితో కలిసి సమస్యను స్థలంలో పరిశీలించారు. మత్తడి నుంచి బట్టుపల్లి బైపాస్ రోడ్డుకు వెళ్లే కాలువ పూర్తిగా పూడిపోవడం వల్లే నీరు బయటకు పోక ప్లాట్లలో నిలుస్తున్నదని గుర్తించారు.
కాలనీ వాసులు తమ ప్లాట్లకు లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కట్టినప్పటికీ, వరద నీటి సమస్యతో ఇళ్లు నిర్మించలేకపోతున్నారని వాపోయారు. స్పందించిన కార్పొరేటర్ రవి, సమస్యను మేయర్ గుండు సుధారాణి మరియు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గారి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
ఇరిగేషన్ డీఈ మాట్లాడుతూ, చెరువు నుంచి వచ్చే నీటి పారవేతకు శాశ్వతంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు. జెఎస్ఎమ్ కాలనీ ప్రతినిధులు పి. శ్యాంప్రసాద్, డి. రమేష్, జి. చల్మారెడ్డి, కే. శ్రీనివాస్, కృష్ణ రావు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక