తెలంగాణ ధ్వని : టాలీవుడ్‌లో సినిమాల విడుదలకు ముందుగా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అనుమతులు కోరడంసాధారణంగా మారింది. తాజాగా అల్లు అరవింద్ నిర్మించిన “తండేల్” సినిమా విడుదల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, తెలంగాణలో మాత్రం అల్లు అరవింద్ ఎలాంటి అనుమతి కోరలేదని ఆయన స్వయంగా ప్రకటించారు. మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రశ్నించగా, “మా సినిమాకు టికెట్ రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలు అనుమతులు తీసుకోవడం అవసరం లేదు” అని స్పష్టం చేశారు. ఇది తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు విషయంలో అల్లు అరవింద్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా భావించబడుతోంది. అయితే, గతంలో “పుష్ప 2” సినిమా ప్రమోషన్ సమయంలో అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని వార్తలు వస్తున్నాయి. దీనికి భిన్నంగా, దిల్ రాజు నిర్మించిన సినిమాకు మాత్రం టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వడం, రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు రాకుండా చేయలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అరవింద్ తన సినిమాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరకపోవడం, గత వివాదాలపై ఆయన అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక