తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి వార్త. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ప్రకారం చాలా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది. మొదటిగా 2,000 గెజిటెడ్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి, అనంతరం దాదాపు 5,000 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అయితే, ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు ఆమోదంతో మార్పులు కావడంతో ఉద్యోగాల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఈ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం జ్యూడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ సూచనల మేరకు వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసి అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసింది. ప్రస్తుతం ఆ బిల్లు గవర్నర్ సంతకానికి రాజ్ భవన్‌కు పంపబడింది. రెండు, మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదం వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే, రోస్టర్ పాయింట్లు ఖరారు చేసి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఇప్పటికే జీఏడీ శాఖ అధికారులు రిజర్వేషన్ల ప్రకారం మూడు గ్రూపులకు విడివిడిగా రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై కసరత్తు మొదలుపెట్టారు. టెట్ పరీక్ష ఫలితాలు ఇప్పటికే ఫిబ్రవరిలో విడుదల కావడంతో, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద, తెలంగాణలో ఉద్యోగాల జాతరకు మళ్లీ శ్రీకారం చుట్టబడింది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక