- ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలనాథుల హవా
- ఎనిమిది ఎంపీ సీట్లతో బలమైన బీజేపీ
- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ వ్యూహాలు
- బీఆర్ఎస్ నుండి బీజేపీకి ఓటు బ్యాంకు మార్పు?
- స్థానిక సంస్థల ఎన్నికలు – నెక్స్ట్ టార్గెట్
తెలంగాణ ధ్వని : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన బలాన్ని స్థిరపరుచుకుంటూ, రాజకీయంగా మళ్లీ ఊపందుకుంటోంది. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలకు పోటీ చేసి, వాటిలో రెండు గెలుచుకోవడం బీజేపీకి పెద్ద విజయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోయినా, ఆ తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని తన బలాన్ని చాటింది. దీంతో తెలంగాణలో కాషాయ జెండా మరింత రెపరపలాడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి కొత్త శక్తిని అందించాయి. మూడు స్థానాల్లో పోటీ చేసి రెండు గెలుచుకోవడం ద్వారా, బీజేపీ శాసన మండలిలో తన బలాన్ని పెంచుకుంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ ఓటమి చవిచూడడం గమనార్హం. ఈ ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం కల్పించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన ప్రభావాన్ని మరింత పెంచుకుంది. రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు, కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు చేపట్టడం తెలంగాణ బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చింది. 2019 ఎన్నికల కంటే రెట్టింపు ఓటింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో, బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ వరుస వ్యూహాలను అమలు చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తూ, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మూసీ నదీ ప్రక్షాళన, రైతు సమస్యలు, ఆరు గ్యారంటీల అమలుపై నిలదీస్తూ బీజేపీ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. వీటన్నింటితో, రాష్ట్రంలో ప్రతిపక్షంగా తమ వైపు ప్రజాస్పందన మరింత పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
గతంలో బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్న ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడం బీజేపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతిన్న తర్వాత, ఆ పార్టీ మద్దతుదారులు బీజేపీ వైపు రావడానికి అవకాశం ఉందని కమలనాథులు విశ్వసిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చినా, అవి బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తే, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ బలమైన అవకాశం కల్పించుకోనుంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక