తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డి (MCHRD) లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ కీలక నేతలతో కలిసి ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ (AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొని ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు.
గ్రామస్థాయిలో…
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకమైనవని, ఈ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపడం అత్యంత అవసరమని చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరిగేలా అన్ని హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు వేగం పెంచి, ముఖ్యంగా సీసీ రోడ్లు, ఆలయాల నిర్మాణాలు, తదితర కార్యక్రమాలకు నిధుల మంజూరు కోసం మంత్రులను సంప్రదించాలని సూచించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, ఇందుకు గ్రామాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసి, అత్యధిక గ్రామాలను ఏకగ్రీవంగా గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం స్పష్టం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమకు పూర్తి మద్దతు అందించారని, ఇప్పుడు ఆ మద్దతును నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్యేలు మరింత శ్రమించాలని హితవు పలికారు.
బీసీలకు 42% ప్రాధాన్యం
స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కీలక నిర్ణయమని సీఎం తెలిపారు. బీసీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తోందని, ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ వర్గాల్లో విశ్వాసాన్ని పెంచేలా వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నూతన, పాత నేతలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు లేకుండా, ఒక్కసారిగా ముందుకు సాగితేనే కాంగ్రెస్ బలంగా నిలబడగలదని చెప్పారు. గ్రూపులు, విభజనల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే అధికారంలో మరింత స్థిరంగా కొనసాగగలమని వివరించారు.
ఎమ్మెల్యేలకు ప్రత్యేక బాధ్యతలు
సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తూ, తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపును ఖచ్చితంగా సుస్థిరం చేయాలని సీఎం సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే జరగనున్న నేపథ్యంలో, అందులోనూ అధిక స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ముందుకు సాగనున్న కాంగ్రెస్ వ్యూహం
- ప్రభుత్వ హామీల అమలు వేగవంతం చేయడం.
- గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేయడం.
- బీసీలకు 42% స్థానాలు కేటాయించి వారి మద్దతును సమకూర్చుకోవడం.
- పార్టీలో సమన్వయం పెంచి, అంతర్గత విభేదాలను తొలగించడం.
- ఏకగ్రీవంగా అధిక గ్రామాలను గెలిపించేందుకు కృషి చేయడం.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇది మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు. వీటిలో గెలిచి తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణ పెంచడం, అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా స్థానిక స్థాయిలో బలాన్ని పెంచాలని కాంగ్రెస్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారనున్నాయి.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక