తెలంగాణ ధ్వని : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది సందర్భంగా నల్లగొండలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ఉద్దేశించి, కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేశారని, ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ముఖ్యంగా రైతాంగానికి మేలు చేయాల్సిన SLBC టన్నెల్ పనులను దశాబ్దం పాటు వేళ్లూనుకుని నిలిపేశారని, ఏడాదికి ఒక కిలోమీటర్ తవ్వినా ఇప్పటికి పూర్తయ్యేదని అన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలతో నిర్మించి, కేవలం మూడేళ్లలోనే దెబ్బతీసిన కేసీఆర్ అవినీతి పాలనకు నిదర్శనం అంటూ ఆరోపణలు గుప్పించారు. రైతుల సంక్షేమానికి అంకితమైన తమ ప్రభుత్వం, బీఆర్ఎస్ మిగిల్చిన పడావు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తోందని అన్నారు.
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, 2006లో జడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2024లో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని గర్వంగా ప్రకటించారు. గతంలో తనను కేసీఆర్ అరెస్టు చేసినా, ఎనిమిది నెలల్లోనే ఎంపీగా గెలిచినట్టు గుర్తుచేశారు. తన ప్రభుత్వం పేదలకు మూడు కోట్ల మందికి సన్న బియ్యం అందజేస్తోందని, అలాగే 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసామని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కేసీఆర్ కుటుంబం ప్రజాధనం దుర్వినియోగం చేసిందని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. తన పాలనలో అవినీతి చోటుచేసుకోదని, ప్రతి రూపాయిని ప్రజల అభివృద్ధికి వినియోగిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారని, తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతామని చెప్పారు. ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో సుభిక్షతను తెచ్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక