telanganadwani.com

BRSvsCongress

తెలంగాణ రాజకీయ సంక్షోభం – ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు, అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు

తెలంగాణ ధ్వని : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ (BRS) పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. వీరికి బీఆర్‌ఎస్ ఫిర్యాదుపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యేలు సమయం కోరగా, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా దృష్టి సారించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తుండటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10వ తేదీ లోగా స్పీకర్ కార్యాలయం సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.

ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు

సుప్రీంకోర్టు సోమవారం 7 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది. వీరిలో:

  • పోచారం శ్రీనివాస్ రెడ్డి
  • బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • కాలే యాదయ్య
  • టీ. ప్రకాశ్ గౌడ్
  • అరికెపూడి గాంధీ
  • గూడెం మహిపాల్ రెడ్డి
  • ఎం. సంజయ్ కుమార్

ఈ 7 మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాక, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఈ కేసుతో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుపై ఫిబ్రవరి 10న తదుపరి విచారణ జరగనుంది.

కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆందోళనకు గురయ్యారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణ

అయితే, కొందరు ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్‌లో చేరలేదని అంటున్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తన క్యాంప్ ఆఫీస్‌లో ఇప్పటికీ కేసీఆర్ ఫొటోనే ఉంచినట్లు తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తన క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్ ఫొటోనే ఉన్నదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనర్హత భయంతో ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీకి నమ్మకంగా ఉంటే తమ క్యాంప్ ఆఫీస్‌లలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి స్పందన

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులపై బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు అనేవి ప్రొసీజర్‌లో భాగమేనని చెప్పారు. ఉప ఎన్నికల గురించి బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అంతేకాక, సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక రావొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తదుపరి చర్యలు

సుప్రీంకోర్టు, అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇస్తారు? స్పీకర్ కార్యాలయం దీనిపై ఏమి నిర్ణయం తీసుకుంటుంది? సుప్రీంకోర్టు ఆదేశాలతో అనర్హత వేటు వేయాలా? లేదా మరోమారు ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చే అవకాశముందా? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఫిబ్రవరి 10న జరిగే తదుపరి విచారణతో రాజకీయ పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారనున్నాయి.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top