తెలంగాణ ధ్వని : ఇన్నాళ్లు నకిలీ వస్తువులు, మందులను మాత్రమే చూసాం కానీ తాజాగా నకిలీ వైద్యులు కూడా పుట్టుకు వస్తున్నారు. ఎంబీబీఎస్ చదివినట్టు బిల్డప్ ఇవ్వడమే కాదు ఏకంగా తెల్ల కోటు వేసుకుని వైద్యం చేస్తున్నారు. అది ఓ పేరున్న ఆస్పత్రిలో చిన్న పిల్లల డాక్టర్ గా అవతారం ఎత్తి వైద్యం చేస్తున్న ఓ నకిలీ డాక్టర్ ఆటకట్టించారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదినగూడ అంకుర ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మదీనగూడాలోని అంకుర ఆస్పత్రిలో గత నెలలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మదినగూడ అంకుర ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ల సర్టిఫికెట్స్ పరిశీలించారు. అయితే పిడియాట్రిషన్ గా విధులు నిర్వహిస్తున్న కలపాల భరత్ కుమార్ వ్యక్తి డాక్టర్ సర్టిఫికేట్లు నకిలీవని, ఆయన అర్హత లేకున్నా చిన్న పిల్లలకు వైద్యం చేస్తున్నాడని గుర్తించారు.
భరత్ కుమార్ ఎంబీబీఎస్ అర్హత సాధించకుండానే విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ పరీక్ష రాసి, తెలంగాణ వైద్య మండలి నుంచి రిజిస్ట్రేషన్ లేకుండానే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అని చెప్పుకుంటున్నాడని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. అంకుర ఆస్పత్రిలో పీడియాట్రిక్ విభాగంలో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (డీఎంఓ) గా పనిచేస్తున్నారు.
అయితే ఆయన విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు అవసరమైన తప్పనిసరి పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదు, అలాగే తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) లో నమోదు చేసుకోలేదు. అయినప్పటికీ, ఆయన వైద్యం చేస్తున్నట్లు తేలింది.
భరత్ కుమార్ నకిలీ సర్టిఫికెట్స్‌తో అంకుర ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు వెల్లడైంది. ఈ నకిలీ వైద్యుడు, డాక్టర్ భైరం భరత్ కుమార్ అనే అసలైన వ్యక్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ వాడుతున్నాడని, చివరికి తన తండ్రి పేరు సైతం నకిలీ అని తేలింది. భరత్ కుమార్ నకిలీ సర్టిఫికెట్స్ లో 2016 నుండి 2026 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉందని, కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రకారం 5 ఏళ్లకు మాత్రమే చెల్లుబాటు అయ్యే కాలం ఉంటుందని. దాన్ని పూర్తిగా విస్మరించిన అంకుర ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి సర్టిఫికెట్స్ చెక్ చేయకుండా విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం.
అయితే కంపాల భరత్ కుమార్ వినియోగిస్తున్న రిజిస్ట్రేషన్ నెంబర్ భైరం భరత్ కుమార్‌ది అని మెడికల్ కౌన్సిల్ అధికారులు గుర్తించారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంకుర హాస్పిటల్ లో పని చేస్తున్న అందరి డాక్టర్ల డేటా చెక్ చేసే పనిలో పడ్డారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు. కలపాల భరత్ కుమార్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు.
ఎన్ని రోజులు విధులు నిర్వహించారు. ఆయనకు ఇచ్చిన జీతం ఎంత. అయన చేసిన ట్రీట్మెంట్ లో ఎటువంటి ఫిర్యాదులు వచ్చాయి. ఏంటి అనేదానిపై మెడికల్ కౌన్సిల్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
అంకుర ఆస్పత్రిలో ఫేక్ పిడియాట్రిక్ డాక్టర్ భాగోతం పై మియాపూర్ పోలీసులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఫిర్యాదు చేయగా కంపాల భరత్ కుమార్ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నెంబర్ 423/2025 నమోదు చేసి సెక్షన్ 319(2), 318(4), 338,336 (3), 34(2), బీఎన్ ఎఎస్, 22 టీఎంపీఆర్, 34 రెడ్ విత్ డబ్ల్యూ 54 ఎన్ఎంసీఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆయితే నకిలీ డాక్టర్ కంపాల భరత్ కుమార్ మాత్రం తానే మోసపోయానని అధికారుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక