telanganadwani.com

AlcoholKills

పందెం పోరులో ప్రాణాలు కోల్పోయిన యువకుడు: మద్యం తాగి మరణం..

తెలంగాణ ధ్వని : నలుగురు ఫ్రెండ్స్ ఒక్కదగ్గరికి చేరారంటే సందడి మామూలుగా ఉండదు. ఒకరిపై ఒకరు జోక్స్ వేస్తూ, ఆటపట్టిస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని సార్లు పందాలు కాస్తుంటారు.

ఇంత ఫుడ్ తినాలని, ఇంత మద్యం తాగితే డబ్బులిస్తామని పందెం కాస్తుంటారు. అయితే సరదాగా చేసే ఈ పనులు ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయి.

కోలార్ జిల్లాలోని ముల్బాగల్ ప్రాంతంలో జరిగిన దురదృష్టకర సంఘటనలో, 21 ఏళ్ల కార్తీక్ అనే యువకుడు తన స్నేహితులతో పందెం కాసి ప్రాణాలు కోల్పోయాడు. నీళ్లు కలపకుండా ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం తాగితే రూ. 10,000 ఇస్తామని స్నేహితులు పందెం వేయగా, దానిని నెగ్గాలని ప్రయత్నించిన కార్తీక్ మృతి చెందాడు.

వివరాల ప్రకారం, కార్తీక్ తన స్నేహితులు వెంకట రెడ్డి, సుబ్రమణి మరియు మరికొందరితో కలిసి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకట రెడ్డి అనే వ్యక్తి కార్తీక్‌కు ఈ సవాలు విసరగా, అతను దానిని అంగీకరించాడు.

మద్యం సేవించిన కొద్దిసేపటికే కార్తీక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్నేహితులు అతన్ని ముల్బాగల్‌లోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ విషాదకర ఘటనపై కార్తీక్ కుటుంబ సభ్యులు నంగలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి వెంకట రెడ్డి మరియు సుబ్రమణిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై నిర్లక్ష్యం మరియు ప్రాణాలకు హాని కలిగించే చర్యలకు పాల్పడినందుకు కేసు నమోదు చేశారు.

మృతుడు కార్తీక్‌కు వివాహమై ఏడాది మాత్రమే అయింది, మరియు అతని భార్య ఎనిమిది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top