telanganadwani.com

UnexpectedFortune

పాత డాక్యుమెంట్స్.. కొత్త అదృష్టం! షేర్ల విలువ చూస్తే షాక్ అయిన రతన్..

తెలంగాణ ధ్వని : ఆదృష్ట దేవత ఎప్పుడు..? ఎవ్వరిని.? ఎలా వరిస్తుందో అస్సలు చెప్పలేం. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చండీగఢ్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రతన్ అనే వ్యక్తికి రాత్రికి రాత్రే అదృష్ట దేవత వరించింది.

అతడు తన ఇంట్లోని పురాతన బీరువా వెతుకుతుండగా.. ఏవో పాత కాగితాలు కనిపించాయి. ఇక అవి అతనికి దాదాపుగా రూ. 12 లక్షలు తెచ్చిపెట్టాయి. 1988లో రతన్ తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొన్న షేర్స్ అగ్రిమెంట్ పేపర్స్ అతడికి బీరువాలో లభించాయి. అప్పుడు ఒక్కో షేర్ రూ. 10 చొప్పున 30 షేర్లు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని రతన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. దీనిపై ట్రేడ్ నిపుణులు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

1998లో రూ. 10.. మరి ఇప్పుడు..

రతన్ ధిల్లాన్ ట్వీట్ ప్రకారం, ఈ RIL షేర్లను 1988లో అతడి తండ్రి కొనుగోలు చేశారు. అప్పుడు ఒక్కో షేర్ ధర రూ. 10 మాత్రమే. ఆ సమయంలో 30 షేర్లు కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు రిలయన్స్ షేర్లు రూ.1200 పైమాటే. అతడి పోస్టుపై ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ(IEPFA) కామెంట్ చేసింది. ఆ RIL షేర్లు చాలాకాలం పాటు క్లెయిమ్ చేయకపోవడంతో, అవి IEPFAకి బదిలీ అయ్యి ఉండొచ్చునని తెలుస్తోంది. ఒకవేళ ఆ షేర్లు IEPFAకి బదిలీ చేయబడితే.. వాటిని ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా రతన్ తన డీమ్యాట్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్‌ను IEPFA అతడి ట్వీట్‌కు యాడ్ చేసింది. అలాగే Zerodhaకు చెందిన కామత్ సోదరులు కూడా రతన్‌కు తమ సాయాన్ని అందించారు.

RIL షేర్ల విలువ ఇలా..

అప్పటి 30 RIL షేర్లకు.. ఆ తర్వాత 3 సార్లు స్టాక్ స్ప్లిట్, 2 సార్లు బోనస్ వచ్చాయ్. దాని ప్రకారం రతన్‌కు ప్రస్తుతం 960 షేర్లు వస్తాయి. ప్రస్తుత ధర ప్రకారం, వాటి విలువ దాదాపు రూ.12.05 లక్షలు అని ఒక ట్రేడ్ అనలిస్ట్ కామెంట్ చేశాడు. అలా కాదని.. 1988 తర్వాత నాలుగు 1:1 బోనస్ ఇష్యూలను మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పుడు 30 షేర్లు.. 863 షేర్లుగా మారాయి. బుధవారం BSEలో RIL ముగింపు ధర రూ.1255.95, అంటే వాటి ప్రస్తుత విలువ దాదాపు రూ.10.83 లక్షలు అవుతుందని అంచనా.

RIL ఎన్నిసార్లు బోనస్..

మీడియా నివేదికల ప్రకారం, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ 1970లలో లిస్టింగ్ అయినప్పటి నుంచి ఆరుసార్లు బోనస్‌లను ప్రకటించింది. మొదటి బోనస్ 1980లో 3:5 నిష్పత్తిలో, తర్వాత 1983లో 6:10 నిష్పత్తిలో, ఆ తర్వాత 1997, 2009, 2017 ఇటీవల 2024లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించాయి.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top