తెలంగాణ ధ్వని : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో పేరుకుపోయిన ఆస్తి పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం 90% వడ్డీ మినహాయింపు ప్రకటించింది. ఈ నిర్ణయం పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది. చాలామంది గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను బకాయిలను చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. వడ్డీ మినహాయింపుతో ప్రజలు తక్కువ మొత్తాన్ని చెల్లించి తమ ఆస్తి పన్ను బకాయిలను క్లియర్ చేసుకునే అవకాశం లభించనుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, ప్రభుత్వం ప్రజలకు తగిన సడలింపులను అందించిందని అన్నారు.
అయితే, ప్రస్తుతం ఉగాది, రంజాన్ పండుగల సమయం కావడంతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని, వారి తక్షణ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరికొంత సమయం అవసరమని పేర్కొన్నారు. పండుగలకు సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఈ నెలాఖరు లోపు తగినంత మొత్తం సేకరించి పన్ను చెల్లించడం కష్టమవుతుందని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఈ రాయితీ గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తే, పేదలు, మధ్య తరగతి ప్రజలు మరింత సౌకర్యంగా తమ బకాయిలను తీర్చగలుగుతారని అభిప్రాయపడ్డారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక