telanganadwani.com

UnionMinister

బండి సంజయ్‌ కాళేశ్వరం పుష్కరాల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం..

తెలంగాణ ధ్వని : కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీపై ఉన్న శ్రద్ధ పుష్కరాల నిర్వహణపట్ల లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారని, ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. కుంభమేళా సందర్భంగా 50 కోట్ల మంది భక్తులకు తమ ప్రభుత్వం అద్బుతమైన ఆతిథ్యమిచ్చిందని.
కాళేశ్వరం పుష్కరాలకు విచ్చేసే 50 లక్షల మందికి సరైన ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.
ఈరోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీమణి బండి అపర్ణతో కలిసి కాళేశ్వరం విచ్చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పోలీస్ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య బండి సంజయ్ దంపతులు సరస్వతి నదీమ తల్లి పుష్కర స్నానాన్నిఆచరించారు. అక్కడి నుండి నేరుగా శ్రీకాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు.
BandiSanjayబండి సంజయ్ దంపతులకు పూజారులు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. అంతకుముందు పుష్కర ఘాట్ వద్ద, ఆ తరువాత కాళేశ్వరస్వామి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే…
సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈరోజు కాళేశ్వరం విచ్చేసి పుష్కర స్నానం ఆచరించడం చాలా సంతోషంగా ఉంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం ఇది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు హాజరై స్నానమాచరించడం ఆనందంగా ఉంది.
దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని, నరేంద్రమోదీ నాయకత్వంలో దేశానికి మరింతగా సేవలందించేలా దీవించాలని ఆ స్వామివారిని ప్రార్ధించిన.
సరస్వతి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.35 కోట్లు మాత్రమే కేటాయించింది. అధికారులు కష్టపడుతున్నప్పటికీ ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయి? ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళా సందర్భంగా 50 కోట్ల మంది భక్తులకు అద్బుతమైన ఆతిథ్యం ఇచ్చారు.
కానీ ఇక్కడ 50 లక్షల మంది దర్శించుకునే పుష్కరాలకు ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయి? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే దక్షిణాది మొత్తానికి పండుగగా నిర్వహించుకునే వాళ్లం.
అందాల పోటీల నిర్వహించడానికి అభ్యంతరం లేదు. కానీ ఆధ్యాత్మిక పుష్కరాలను పట్టించుకోవడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం విఫలమైంది.
ఏమైనా మాట్లాడితే కేంద్రం ఏం చేస్తోందని మాట్లాడతారు.
అన్నీ కేంద్రమే చేస్తే ఇక మీరున్నది ఎందుకు? కేవలం ఒక ఏరియాకే పుష్కరాలను పరిమితం చేయడం సరికాదు..పుష్కర స్నానానికి వచ్చే భక్తులందరి కోర్కెలు తొలగిపోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా.
కాళేశ్వరం చాలా పవర్ ఫుల్ ప్లేస్. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మనకు చాలా చెడ్డ పేరొచ్చింది. అట్లాగే గత ప్రభుత్వం కాళేశ్వరం ఆలయానికి రూ.వంద కోట్లు ఇస్తానని మొండి చేయి చూపింది.
ప్రస్తుత సీఎం కూడా 200 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. గతంలో వేములవాడకు కూడా ఇట్లనే హామీ ఇచ్చారు. కానీ ఎన్ని నిధులిచ్చారో ప్రజలందరికీ తెలుసు.
ఇకనైనా ఒట్టి హామీలను పక్కనపెట్టి కాళేశ్వరంను అద్బుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నా.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top