-
బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగం
-
ఏప్రిల్ 27 వరంగల్ సభకు లక్షలాదిగా ప్రజలు హాజరుకావాలి
-
బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణ శత్రువులుగా కేటీఆర్ విమర్శ
-
బీఆర్ఎస్ ఓటమికి అసూయ, ద్వేషం, ఆశ కారణం
-
పార్టీని నిజమైన కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలి
-
కరీంనగర్ నుంచి గులాబీ జెండా ఎగరాలని దిశానిర్దేశం
తెలంగాణ ధ్వని : కరీంనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కీలక ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి బీఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడుతున్న వారిని సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసమే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని, ఇది చారిత్రక బాధ్యత అని చెప్పారు.
కరీంనగర్ బీఆర్ఎస్‌కు అత్యంత ప్రాముఖ్యమైన స్థలం అని, ఇది కేసీఆర్‌కు సెంటిమెంట్ అయిన ప్రాంతమని కేటీఆర్ పేర్కొన్నారు. 2001 మే 17న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ మైదానంలో జరిగిన ‘సింహ గర్జన’ సభ ద్వారా కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసారని గుర్తు చేశారు. అప్పట్లో తెలంగాణ అంశాన్ని అణిచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించినా, కేసీఆర్ తన రాజీనామాతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, 2006లో రాజీనామా చేసి ఉపఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి కరీంనగర్ తన బలం చూపించిందని అన్నారు.
కేటీఆర్ తన ప్రసంగంలో బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఈ రెండు పార్టీలు శత్రువులుగా ఉన్నాయని అన్నారు. 2014 ఎన్నికల ముందు మోదీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రూ. 15 లక్షలు జన్‌ధన్ ఖాతాల్లో వేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో ఏమి చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎప్పుడూ అన్యాయం చేస్తూనే వచ్చిందని, విభజన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణను అణగదొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని, అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి ఉద్యమకారులను అణగదొక్కిందని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు మరింత సంక్షోభంలో పడతారని, ఇప్పటికే రైతుల పరిస్థితి దిగజారిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలోనే అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందని, భవిష్యత్తులో ఆ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉందని అన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీని కాపాడటానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికి మాత్రమే భవిష్యత్తులో అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజల్లో పనిచేయకుండా కేవలం ఎమ్మెల్యే చుట్టూ తిరిగే వారికి భవిష్యత్తులో అవకాశమే ఉండదని హెచ్చరించారు. ఏప్రిల్ 27 తర్వాత బీఆర్ఎస్ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభమవుతుందని, కొత్త కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే వారిని వదిలిపెట్టేది లేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన అధికారులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రిటైర్ అయ్యి విదేశాలకు వెళ్లినా వారిని తిరిగి రప్పించి లెక్కలు తేలుస్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ మోసాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, ఈ రెండు పార్టీలు కలిపి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని, భవిష్యత్తులో అలాంటి మోసాలకు తావు ఇవ్వకూడదని పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచి గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్లాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
ఇంతకుముందు కూడా ఎన్నో ఎన్నికల్లో ప్రతిపక్షాలు బీఆర్ఎస్‌ను నెగటివ్ ప్రచారం ద్వారా ఓడించాలనుకున్నాయని, కానీ ప్రతి సారి బీఆర్ఎస్ మరింత బలంగా తిరిగి వచ్చిందని గుర్తు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగబోతుందని, ఆ సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరై మద్దతు తెలియజేయాలని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు.కేటీఆర్ ప్రసంగంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక
