తెలంగాణ ధ్వని : ఈ నెల 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎలుకతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు బృహత్తర ఏర్పాట్లు చేపట్టాయి. ఈ మహాసభలకు డివిజన్ల నుండి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివెళ్లేలా చర్యలు తీసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి పిలుపునిచ్చారు. సోమవారం ఉర్సు ప్రతాప్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన రెవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు బీద ప్రజలకు ఏమి ఒరగబెట్టలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారం నుండి బయట పడిన తర్వాత, తూర్పు నియోజకవర్గంలోని కొంతమంది నేతలు ఇతర పార్టీలకు వెళ్లినప్పటికీ, ఇప్పుడు మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.
పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన కార్యకర్తలే నిజమైన బలమని పేర్కొన్నారు. డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలనీ, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ రజతోత్సవ మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని నేతలు పేర్కొన్నారు. పార్టీ పునర్నిర్మాణానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ తిరిగి బలోపేతం కావడానికి ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని పేర్కొన్నారు. సభలో పాల్గొనాలని గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి వనం కుమార్, బూత్ కన్వీనర్లు మరుపల్ల గౌతం, శెట్టి మోహన్, పోలెపాక రాజన్ బాబు, సాదుల రంజిత్, కళ్యానపు వెంకటేశ్వర్లు, పోలెపాక మల్లేశం, తౌతం నరసింహ, గడ్డం రమేష్, మంద నవీన్, వేల్పుగొండ నర్సింగం, కొలుపుల చంద్రకళ, ఎండి వహీదా, గుల్లపెల్లి కర్ణ, పుట్టబత్తుల స్రవంతి, నామాల రాజు, బండారి సదానందం, భౌరిశెట్టి సదానందం తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక