తెలంగాణ ధ్వని : బహుజన రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తన రజతోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ సభ నిర్వహించనుంది.
ఈ సభ ద్వారా బీఆర్‌ఎస్ తన ప్రజాదరణను ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలను తీసుకురావడం కోసం బస్సుల అవసరం పెరిగింది. దీనిలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ టీఎస్ ఆర్టీసీని సంప్రదించింది.
పార్టీ తరపున జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, నేతలు తుంగబాలు, కురువ విజయ్ కుమార్ కలిసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిశారు. ఈ సభ కోసం 3,000 బస్సులు అద్దెకు కావాలని విజ్ఞప్తి చేశారు.
బస్సుల అద్దె ఖర్చుగా రూ. 8 కోట్ల చెక్కును RTC అధికారులకు అందజేశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ బస్సులు అడిగినప్పుడు తిరస్కరించిందని కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఆరోపించారు.
ఇప్పుడు అదే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ RTC బస్సులను కోరుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాధారణను పరీక్షించుకునే కార్యక్రమంగా ఈ సభను బీఆర్‌ఎస్ భావిస్తోంది.
బస్సుల పంపిణీ, రూట్ మ్యాపింగ్, భద్రత ఏర్పాట్లు మొదలైనవి త్వరలోనే ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభకు హాజరై కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది.
ఈ సభ ద్వారా కొత్త రాజకీయ వ్యూహానికి బీఆర్‌ఎస్ బీజం వేసే అవకాశముంది. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ ఇది అనుమతిస్తే తమ వైఖరిపై విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.
రాజకీయంగా ఈ సభ రాష్ట్రవ్యాప్తంగా కీలక పరిణామాలకు నాంది కావచ్చన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఎల్కతుర్తిలో ఈ రజతోత్సవ సభ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేసే అంశంగా నిలవనుంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక