తెలంగాణ ధ్వని : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యారంగాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ, పేద విద్యార్థుల భవిష్యత్తును అనుకూలంగా మార్చలేకపోతుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు IITలు, IIMలు, ఢిల్లీ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చేరితే, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో 1,913 ప్రభుత్వ స్కూళ్లు మూసివేసి, విద్యార్థులకు నష్టం కలిగించిందని కవిత విమర్శించారు.
విద్యా కమిషన్‌ను రాజకీయ కమిషన్‌గా మార్చి, గత 9.5 ఏళ్లలో విద్యా వ్యవస్థ నాశనమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యా అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.24,000 కోట్లకు పైగా ఖర్చు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిందని అన్నారు. కేసీఆర్ హయాంలో విద్యా సంస్కరణలు అమలయ్యి, ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 25,000 పోస్టులతో మెగా DSC నిర్వహిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు అమలు చేయలేదని కవిత విమర్శించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రయోజనం కలిగించే విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఫీజు రద్దు చేయడం వల్ల అడ్మిషన్లు పెరిగాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగంపై సరైన దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక