తెలంగాణ ధ్వని : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట 64 మంది మావోయిస్టులు లొంగిపోయారు. శనివారం కొత్తగూడెం పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ బి.రోహిత్‌రాజ్‌లు ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన వారంతా చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందినవారని తెలిపారు.
లొంగిపోయిన వారిలో ఏసీఎం మెంబర్లతో పాటు పలు హోదాల్లో ఉన్నవారు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా లొంగుబాటుదారులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.16 లక్షలు ఆర్థికసాయం అందజేశారు. గత ఏడాదిన్నరలో మొత్తం 122 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు.
మావోయిస్టులు ప్రజల్లో మద్దతు కోల్పోయారని, ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలవాలని అధికారులు సూచించారు. మావోయిస్టుల కట్టడికి భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారని, ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక