telanganadwani.com

BhūbhāratiAct

భూ సమస్యల సత్వర పరిష్కారానికి రూపొందించిన భూభారతి చట్టం చారిత్రాత్మకం.

తెలంగాణ ధ్వని : నూతన ఆర్ ఓ ఆర్ చట్టంపై వర్ధన్నపేట, పర్వతగిరి లలో జరిగిన అవగాహన సదస్సులలో కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలసి పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు
 రాష్ట్రంలో భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టం భూభారతియని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అన్నారు.
వరంగల్ జిల్లా వర్షన్నపేట మండలం కేంద్రంలోని ఏబీఎన్ ఫంక్షన్ హాల్ లో,  పర్వతగిరి మండలం కేంద్రంలోని పిఏసీఎస్ భవనంలో బుధవారం రైతులు, ప్రజలకు నిర్వహించిన  భూ భారతి అవగాహన  సదస్సు లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలు ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా భూభారతి- నూతన ఆర్వోఆర్ చట్టానికి సంబంధించిన అంశాలు, మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.
 ఈ సందర్భంగా  శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ భూ సమస్య‌లు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాల‌న్న ల‌క్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చామ‌ని అన్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన భూభార‌తి చ‌ట్టం ప్ర‌యోజ‌నాలు సామాన్య ప్ర‌జ‌ల‌కు చేరిన‌ప్పుడే దానికి సార్ధ‌క‌త ఏర్ప‌డుతుంద‌ని అన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి దేశానికే రోల్ మోడల్ అని అన్నారు.
ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే సదుద్దేశంతో భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామని తెలిపారు. రైతులు, ప్రజల అభిప్రాయాలను తీసుకునే  భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని, తదుపరి భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
ధరణి పోర్టల్  తీసుకురావడంతో  గ్రామాల్లో మనశ్శాంతి లేకుండా పోయిందన్నారు.   రైతులు, ప్రజలు భూ సమస్యలు పరిష్కరించేందుకు ఈ చట్టం తీసుకువచ్చిందన్నారు.
  ఈ చట్టం ద్వారా సమస్యలు ఒక్క పైసా ఖర్చు లేకుండా నిజమైన రైతులకు, ప్రజలకు భూహక్కులు లభిస్తాయన్నారు.భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు.
ఎంతోమంది మేధావులు, అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు.ఈ చట్టం ద్వారా ఏవైనా న్యాయపరమైన సమస్యలు తలెత్తినప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తారని, తద్వారా  వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారని అన్నారు.
భూ భారతి చ‌ట్టంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు, ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల‌న్న ల‌క్ష్యంతో జిల్లాలోని అన్ని మండలాల్లో  జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న స‌ద‌స్సుల‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
  రైతులు, ప్రజల మేలు కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం  నియమిస్తుందని తెలిపారు.
ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ 
ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూముల పై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా లభించనుందని అన్నారు.
ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని అన్నారు.
భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే భూ భారతి చట్టాలు ప్రకారం అప్పిలు చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు.
గతంలో తహసిల్దారు పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చేవని, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల పరిష్కరించడంలో జాప్యం జరిగేదని తెలిపారు. భూభారతి ద్వారా కింది స్థాయికి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారని దీనివల్ల భూమికి సంబంధించిన చిన్న సమస్యలు మండల స్థాయిలోని సత్వరం పరిష్కారం అవుతాయని తెలిపారు.
ఈ పోర్టల్‌లో   రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇతరాల పేరిట ప్రత్యేక మాడ్యూల్స్‌, సెక్షన్స్ గురించి  కలెక్టర్ వివరించారు.
భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన భూభారతి చట్టం మార్గదర్శకాలను రైతులు, ప్రజలకు తెలియజేసేందుకు జిల్లాలో అన్ని మండలాల్లో ప్రతిరోజు రెండు మండలాల చొప్పున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  రైతులు, ప్రతి ఒక్కరికీ నూతన చట్టం భూభారతి, దానిలోని అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
   ఇంతకు ముందు ఉన్న ధరణిలో కోల్పోయిన హక్కులు, కొత్త చట్టంలో ఎలాంటి హక్కులపై అవగాహన కల్పించేందుకు  ఈ సదస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.   సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరు తమ తమ గ్రామాల్లో నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం గురించి  ప్రజలకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా స్థాయిలో  రైతులకు, ప్రజలకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయపరమైన సేవలు  అందిస్తామన్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూభారతిలో మూడంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా నూతన చట్టం, తమ భూ సమస్యల గురించి ఆయా గ్రామాల రైతులు, ప్రజలు అభిప్రాయాలను వెల్లడించారు. సదస్సులో వర్షన్నపేట, పర్వతగిరి మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజల భూ సమస్యలకు సంబంధించిన  సందేహాలను రెవిన్యూ అధికారులు నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా నీటిపారుదల అధికారి శంకర్,  జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు గౌస్ హైదర్,  ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్ లు విజయ్, వెంకటస్వామి, ఎంపిడివో లు వెంకటరమణ,  శంకర్, పిఏసీఎస్ చైర్మన్లు గొర్రె దేవేందర్, మనోజ్ గౌడ్
స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,  వివిధ గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top