telanganadwani.com

మన భువనగిరి నుండి బీసీసీఐకి బుల్లి బహుమతి…

తెలంగాణ ధ్వని: దేశంలో రాజకీయ నేతలు, సినీ, క్రికెట్ స్టార్లకు అభిమానులు కోకొల్లలు. తమ అభిమాన స్టార్స్ ఉన్న టీషర్ట్స్ ధరించడం, సెల్ ఫోన్ లో డిపి గా పెట్టుకుని వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తుంటారు.

కానీ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ క్రికెట్ అభిమాని తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. అతను ఏ విధంగా తన అభిమానాన్ని చాటుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో క్రికెట్ కు చాలా క్రేజ్ ఉంది. నిరంతరం జరిగే టీ20, వన్డే, టెస్ట్ మ్యాచ్ లను వీక్షిస్తూ అభిమానులు ఉత్కంఠకు గురవుతున్నారు. తాజాగా కొనసాగుతున్న ఐసీసీ చాంపియన్ ట్రోఫీ-2025లో అభిమానులు మునిగి తేలుతున్నారు. పైగా ఎనిమిది దేశాలు పాల్గొంటున్న ఈ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ కు చేరడంతో ట్రోఫీపై వారిలో మరింత ఆసక్తిని పెంచుతోంది. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించి సత్తా చాటిన టీమిండియా ఈ ట్రోఫీలో ఛాంపియన్ నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

18 మిల్లీ మీటర్ల ఎత్తుతో ఛాంపియన్స్ ట్రోఫీ..

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణానికి చెందిన స్వర్ణకారుడు చొల్లేటి శ్రీనివాసాచారి క్రికెట్ అభిమాని. క్రమం తప్పకుండా అన్ని క్రికెట్ మ్యాచ్ లను చూస్తుంటాడు శ్రీనివాస చారి. అయితే క్రికెట్ పై ఉన్న తన అభిమానాన్ని బంగారంతో చాటుకున్నాడు. 600 మిల్లీగ్రాముల బంగారంతో 18 మిల్లీ మీటర్ల ఎత్తుతో బుల్లి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపొందించాడు. రూ.5,160 వ్యయంతో ఏడు గంటలపాటు ఏకాగ్రతతో శ్రమించి ఈ బంగారు ట్రోఫీని తయారు చేశాడు. గతంలోనూ బంగారం, వెండితో ఏకంగా క్రికెట్ మైదానంతో పాటు బ్యాట్లు, వికెట్స్, బంతులు రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు అందరితో శభాష్ అనిపించుకున్నాడు శ్రీనివాస చారి. టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సాధించిన వెంటనే తాను రూపొందించిన చిన్ని ట్రోఫీని బీసీసీఐకి బహుమతిగా పంపుతానని శ్రీనివాస చారి చెబుతున్నాడు.

రిపోర్టర్: జావలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top