తెలంగాణ ధ్వని న్యూస్ : ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పాటైన మల్లంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర, అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మహేందర్ జీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 33 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల వ్యవసాయ సహకార సంఘం గోదాంను కూడా ప్రారంభించారు.
మల్లంపల్లి ప్రజల గత 10 సంవత్సరాల పోరాటం ఫలితంగా, ఈ ప్రాంతంలో కొత్త మండలం ఏర్పాటు చేయడం వలన స్థానిక ప్రజల కలలు నెరవేరాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మండల ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించామని అన్నారు. ఈ మండలం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించి, ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంతేకాక, స్థానిక రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపించినట్లు, భూమి కోల్పోయిన రైతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని, గ్రామ సభల్లో గొడవలు చేయకుండా సహకరించాలనే సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లంపల్లి ప్రజలు పండుగ వాతావరణంలో హర్షం వ్యక్తం చేశారు.