తెలంగాణ ధ్వని : మావోయిస్టుల హింసకు బలైన బాధిత కుటుంబాల ప్రతినిధులు మే 1న చర్లలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎం విజయశర్మలను కలిశారు. వారు “ఆపరేషన్ కగార్”ను కొనసాగించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు .
ఈ ఆపరేషన్ ద్వారా గత కొన్ని నెలలుగా భద్రతా బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదముంచి పలు ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాయి. ఎదురుకాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు మృతి చెందగా, మరికొంతమంది లొంగిపోయారు. ఈ చర్యల వల్ల గిరిజన ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మెరుగయ్యాయని బాధితులు పేర్కొన్నారు.
తమ గ్రామాల్లో మళ్లీ మావోయిస్టులు చురుకుగా మారకుండా ఆపరేషన్‌ను నిరవధికంగా కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని, తద్వారా మావోయిజానికి మద్దతు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. భద్రతా బలగాల నెరవేర్చిన సేవల వల్ల ప్రజల్లో నమ్మకంతోపాటు భవిష్యత్తుపై ఆశలు కూడా పెరిగాయని తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి, సమస్యలను గమనించడాన్ని వారు సానుకూలంగా చూశారు. శాశ్వత శాంతి కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని, ప్రజల జీవితాలలో భద్రతా వెలుగులు పరచాలని వారు ఆకాంక్షించారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక