తెలంగాణ ధ్వని : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో మరోసారి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మొదటి యూనిట్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
యూనిట్‌లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల ప్రమాదం మొదలైంది. అదే సమయంలో బాయిలర్ కింద వెల్డింగ్ పనులు జరుగుతుండటంతో ఆయిల్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించి యూనిట్ మొత్తం అగ్నికి ఆహుతి కావడానికి దారి తీశాయి. భారీ అగ్నికీలలు ఆకాశాన్ని ముదిరించాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. సకాలంలో స్పందించడంతో మరింత పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటన కారణంగా మొదటి యూనిట్‌లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్ రన్‌కు సిద్ధమవుతుండగానే ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం.
అధికారులు వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి, మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ప్రస్తుతానికి యూనిట్‌ను పూర్తిగా మూసివేసి, సురక్షిత చర్యలు చేపట్టారు.
ఇదే యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరో ప్రమాదం జరిగింది. రెండో యూనిట్‌లోని యాష్ ప్లాంట్ వద్ద ఈఎస్‌పీ (ఎలెక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్) వద్ద యాష్ జామ్ కావడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది.
ప్లాంట్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో బాయిలర్ ట్రిప్ అయ్యి నిలిచిపోయింది. యాష్ జామ్ తొలగించే క్రమంలో ఒక్కసారిగా వేడి బూడిద కూలిపోయి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక