తెలంగాణ ధ్వని : వరంగల్ జిల్లాలో డీజిల్ దొంగల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నలుగురు వ్యక్తులు ఒక గుంపుగా ఏర్పడి, రాత్రి వేళ ఓ కారు తీసుకుని వివిధ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తున్నారు. బంకులకు వచ్చి డీజిల్ నింపించుకుని, ఫోన్ పే చేస్తామంటూ మోసంగా వ్యవహరిస్తూ అక్కడి నుంచి పారిపోతున్నారు. వీరి లక్ష్యం డబ్బులు చెల్లించకుండా ఎక్కువ మొత్తంలో డీజిల్ దొంగతనంగా పొందడం. రాయపర్తి, పరకాల, జఫర్గడ్, దామెర, నడికూడ వంటి ప్రాంతాల్లో ఈ సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పెట్రోల్ బంకు యజమానులు మోసానికి గురవుతూ ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఈ విషయంపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పరిశీలనలో భాగంగా ముగ్గురు దొంగలను పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారు గీసుకొండకు చెందిన రంజిత్, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన రేవూరి నవీన్ రెడ్డి, నల్గొండ జిల్లాలోని శెట్టిపాలానికి చెందిన భరత్ చంద్రగా గుర్తించారు. దోపిడికి ఉపయోగించిన కారు, నాలుగు మొబైళ్ళు, రూ.12,500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దొంగతనాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు బంకు యజమానులు భద్రతపై శ్రద్ధ పెట్టాలని, సీసీ టీవీలను పెంచాలని సూచనలు వస్తున్నాయి. ఈ తరహా సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక