తెలంగాణ ధ్వని : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్క పేట గ్రామ శివారులోని జాతీయ రహదారి 365 పై పోలీసుల తనిఖీల్లో గంజాయి రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ తనిఖీల్లో నల్లబెల్లి పోలీసులు కీలకంగా వ్యవహరించారు. వాహనాలను పరిశీలిస్తుండగా, ఓ కారులో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో వారు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ప్రవీణ్, వర్షగా గుర్తించారు. వారు ఒడిశా రాష్ట్రం బాలాపూర్ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్నట్లు నిర్ధారించారు. మహబూబాబాద్ ప్రాంతంలో పోలీసుల తనిఖీలు తీవ్రంగా ఉన్నట్లు తెలుసుకున్న వారిద్దరూ మార్గాన్ని మార్చుకొని నర్సంపేట వైపు వచ్చారని సమాచారం.
అక్కడి నుంచి జాతీయ రహదారి 365 మీదుగా ములుగు జిల్లా మల్లంపల్లి గుండా వరంగల్ చేరేలా ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. అయితే, నార్కపేట శివారులోని పోలీసు చెక్‌పోస్టు వద్ద వారి ప్రయాణం ఆగిపోయింది. వాహన తనిఖీలో కారులో దాచి ఉంచిన 21 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు నిందితులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. గంజాయి సరఫరా ముఠా వెనుక మరెంత మంది ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక