telanganadwani.com

VandeBharatLaunch

వరంగల్ నుండి కొత్త స్లీపర్ వందే భారత్ రైళ్లు ప్రారంభం

తెలంగాణ ధ్వని : వరంగల్ ప్రజలకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. మే నెల చివరి నాటికి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లు వరంగల్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.

ఈ రైళ్లు ప్రయాణికులకు విమాన ప్రయాణ అనుభూతిని అందించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడ్డాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ – విశాఖపట్టణం – సికింద్రాబాద్ మధ్య వరంగల్ మీదుగా రెండు వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి.

వీటికి అదనంగా స్లీపర్ తరగతి వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లలో కూర్చుని ప్రయాణించేందుకు చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ తరగతులు ఉన్నాయి.

అయితే.. కొత్తగా ప్రవేశపెట్టనున్న స్లీపర్ రైళ్లు రాత్రి వేళ ప్రయాణించే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటాయి.

వందే భారత్ రైళ్లు చాలా వేగంగా ప్రయాణిస్తున్నాయన్న సంగతి తెలిసిందే.. అయితే పడుకొని ప్రయాణించడానికి అవకాశం లేదని చాలా మంది ప్రయాణికులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

దూరం వెళ్లే వారు అంత సమయం కూర్చొని వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.. దీంతో కొత్తగా ప్రవేశపెట్టే వాటిలో ఈ సౌకర్యం ఉండనుంది. ఇక ఏం చక్కా పడుకొని మీ జర్నీని స్టార్ట్ చేయవచ్చు.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. మొదటి దశలో దేశవ్యాప్తంగా 9 రైళ్లు ప్రవేశపెడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు 2 రైళ్లు కేటాయించారు. రెండు రైళ్లు వరంగల్ మీదుగా ప్రయాణిస్తాయి.

ఒకటి విజయవాడ నుండి అయోధ్య (వారణాసి) వరకు, మరొకటి సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు నడుస్తాయి. ప్రతి రైలులో 16 బోగీలు ఉంటాయి .

రైల్వేశాఖ ఈ రైళ్ల టికెట్ ధరలు, ఆగే స్టేషన్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ నెలాఖరులోగా వీటిని ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

వరంగల్ మీదుగా స్లీపర్ వందే భారత్ రైళ్లు ప్రారంభం కానుండటం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పడుకొని వందేభారత్ రైళ్లో ప్రయాణించాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

 

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top