telanganadwani.com

వేములవాడ రాజన్న ఆలయ భక్తులకు గుడ్ న్యూస్!

తెలంగాణ ధ్వని న్యూస్ : రాజన్న సిరిసిల్ల , తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తుల కోసం పెద్ద ఎత్తున సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతిరోజూ వేలాదిగా భక్తులు సందర్శించే ఈ ఆలయంలో మహాశివరాత్రి, ఏకాదశి వంటి పండగల సమయంలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనం తర్వాత వసతి గదుల కోసం గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుండటం భక్తులకు ఇబ్బంది కలిగిస్తుందనే విషయం ఆలయ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆలయ అధికారులు ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు.

ఇకపై భక్తులు వసతి గదులు, పూజల టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలు ఉపయోగించుకునేందుకు భక్తులు https://vemulawadatemple.telangana.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వెబ్‌సైట్‌లో వేములవాడ రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన భీమేశ్వర స్వామి, బద్ది పోచమ్మ ఆలయం, శ్రీ నగరేశ్వర స్వామి ఆలయం, నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాల వివరాలు కూడా పొందుపరచబడ్డాయి. పూజా వివరాలు, వసతి గదుల ధరలు, బుకింగ్ వివరాలు అన్నీ భక్తుల సౌకర్యం కోసం అందుబాటులో ఉంటాయి.

మహాశివరాత్రి, ఏకాదశి సమయంలో రద్దీకి భయపడి ఆలయానికి రావడం ఆలస్యం చేసే భక్తులు ఇకపై ముందస్తుగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని తమ సమయాన్నీ, శ్రమనూ ఆదా చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల్లో కూడా టికెట్లను పొందే అవకాశం ఉంది. టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు గతంలో వచ్చిన ఆరోపణలపై తీసుకున్న చర్యలతో పాటు ఈ ఆన్‌లైన్ టికెట్ సిస్టమ్ పూర్తిగా పారదర్శకతను కలిగిఉండేలా రూపొందించబడింది. భక్తులు ఇక ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా స్వామి వారి దర్శనం, పూజలు, వసతి గదులు పొందగలరని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.

ఈ ఆన్‌లైన్ సేవలు భక్తుల సమయాన్నీ, శ్రమనూ ఆదా చేస్తాయని, భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుందనే విశ్వాసాన్ని ఆలయ అధికారులు వ్యక్తపరచారు. ఇది భక్తులకు పెద్ద ఊరటగా మారి, వారి పుణ్యక్షేత్ర యాత్రను మరింత సుఖదాయకంగా చేస్తుంది.

రిపోర్టర్ . కడకుంట్ల అభిలాష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top