telanganadwani.com

శ్రీలంకపై భారత్ ఘన విజయం అదరగొట్టిన తెలుగు అమ్మయిలు.

తెలంగాణ ధ్వని : భారత మహిళల అండర్-19 జట్టుకు ఎదురులేకుండా పోయింది. మలేషియాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో గ్రూపు దశను అజేయంగా ముగించింది.

గురువారం చివరి గ్రూపు మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేసింది. 60 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంక 58/9 స్కోరుకే పరిమితమైంది. భారత్ విజయంలో తెలుగమ్మాయి గొంగడి త్రిష(49), షబ్నమ్ షకీల్(2/9) కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ విజయంతో భారత్ సూపర్-6 రౌండ్‌కు అర్హత సాధించింది. ఆదివారం మలేసియాతో తలపడనుంది.

శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ బ్యాటుతో తడబడినప్పటికీ బంతితో రాణించడంతో విజయం కోసం పెద్దగా కష్టపడలేదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు గొంగడి త్రిష అండగా నిలిచింది. ఓపెనర్‌గా వచ్చిన ఈ తెలంగాణ అమ్మాయి లంక బౌలర్లపై విరుచుకుపడింది. అయితే, మరో ఎండ్‌లో వికెట్లు పడటంతో త్రిష ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అయినా ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు. 44 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 49 పరుగులు చేసింది. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నప్పటికీ భారత్ 118 పరుగులతో పోరాడే స్కోరు సాధించిందంటే త్రిషనే కారణం. త్రిష అవుటయ్యే సమయానికి భారత్ 78/4 స్కోరుతో మెరుగైన స్థితిలోనే ఉంది. కానీ, మిగతా వారు త్రిష దూకుడును కొనసాగించలేకపోయారు. మిథిలా వినోద్(16), జోషిత(14) విలువైన పరుగులు జతచేసి స్కోరును 100 దాటించారు.

ఆ తర్వాత బౌలర్లు భారత్‌ను ఆదుకున్నారు. ఛేదనకు దిగిన శ్రీలంకను 58/9 స్కోరుకే కట్టడి చేశారు. విశాఖ అమ్మాయి, పేసర్ షబ్నమ్ షకీల్ ఆరంభంలోనే లంక జట్టును దెబ్బ మీద దెబ్బ కొట్టింది. తొలి ఓవర్‌లోనే సుముడు నిసంసాల(0)ను డకౌట్ చేసింది. కాసేపటికే దహమి సనేత్మా(2)ను పెవిలియన్ పంపింది. షబ్నమ్‌కు తోడు జోషిత, పారునిక సిసోడియా చెలరేగడంతో శ్రీలంక బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. 12 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడిన ఆ జట్టు ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో రష్మిక సెవ్వండి(15) టాప్ స్కోరర్. ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారంటే భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు ఏవిధంగా విలవిలలాడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. భారత బౌలర్లలో షబ్నమ్ షకీల్, పారునిక సిసోడియా, జోషిత రెండేసి వికెట్లతో సత్తాచాటారు. కీలక ఇన్నింగ్స్ ఆడటంతోపాటు భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు।

రిపోర్టర్ ప్రతీప్ రడపాక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top