తెలంగాణ ధ్వని : చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో గత పదకొండు రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహింపబడుతున్న శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజు చక్రతీర్థోత్సవం (చక్రస్నానం), ధ్వజ అవరోహణం, ఘటాభిషేకం పుష్పయాగంతో సుసంపన్నమయ్యాయి.
అమ్మవారికి ఉదయం గం|| 04-00లకు నిత్యాహ్నికం పూర్తిచేసిన తర్వాత స్నవనవిధి విశేష పూజాదికములు నిర్వహించి అమ్మవారికి చూర్ణోత్సవం జరిపారు. ఈ రోజు సువాసినీమణులు (ముత్తయిదువలు) అందరూ కలసి జరిపిన చూర్ణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

చక్రతీర్ణోత్సవం (చక్రస్నానం) ముఖ్య అర్చకులు శ్రీ చెప్పెల వెంకటనాగరాజ శర్మ నేతృత్వంలో వైభవంగా నిర్వహింపబడింది. దర్శించిన భక్తులు ఒక దివ్యానుభూతికి లోనయి ఆనంద పరవశులయ్యారు.
అనంతరం భేరీతాడనం జరిపి ధ్వజావరోహణం చేశారు. బ్రహ్మోత్సవ నిర్వహణలో అధికారుల, అర్చకుల, భక్తులు లేదా తదితరులెవ్వరివల్లనైనా జ్ఞాతాజ్ఞాతంగా జరిగిన పొరపాట్లు లేదా న్యూనాతరిక్త దోషాలవల్ల సంక్రమించే పాపం తొలగిపోయి బ్రహ్మోత్సవ సంపూర్ణ
సాంగత్వం కలిగి భక్తులందరికీ శుభాలు ప్రాప్తింపజేయడానికి శాస్త్రంలో చెప్పబడిన ప్రకారం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగంలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు.
శాస్త్రంలో చెప్పబడిన మేరకు పుష్పయాగంలో అమ్మవారికి అర్చకులు పదిసార్లు జరిపిన దశార్చనారాధన భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదించింది. ఈ రోజు కార్యక్రమాలకు ఉభయదాతలుగా శ్రీ లక్ష్మీదేవి అసోసియేట్స్, హైదరాబాదు వారు వ్యవహరించారు.
ఈ రోజు శ్రీ భద్రకాళీ దేవస్థానం, వరంగల్ వారి ఆధ్వర్యవములో నిర్వహింపబడుతున్న శ్రీ భద్రకాళీ సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి వారి అనుబంధ
విద్యా సంస్థగా గుర్తింపు ఇవ్వడానికి విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం ప్రొ॥ వేదాంతం విష్ణుభట్టాచార్య వారి నేతృత్వంలో ప్రొ॥ రమేష్బాబు, డా॥ కళ్యాణశాస్త్రి గారలు ఈ రోజు వేదపాఠశాలను సందర్శించి వేదపాఠశాల స్థితిగతులను పరిశీలించి వెళ్ళారు.
ఆలయ సహాయ కమీషనర్ & ఈ. ఓ శ్రీమతి శేషుభారతి మాట్లాడుతూ శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన అధికార, అనధికార ప్రముఖులు, దాతలు, భక్తులు, కులసంఘాలు ముఖ్యంగా ఎలక్ట్రానికి మరియు ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక