తెలంగాణ ధ్వని : వరంగల్ చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల దేవస్థానంలో ఈ రోజు అత్యంత వైభవంగా శ్రీ భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయబడింది. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 29 నుండి మే 10, 2025 వరకు 10 రోజులపాటు జరుగనున్నాయి.
ఈ రోజు పలు పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఉదయం 4:00 గంటలకు అమ్మవారికి నిత్యాహ్నికాలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవాంగీకార ప్రార్థనలు నిర్వహించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు.
దీనిలో భాగంగా గణపతి పూజ, పుణ్యహవాచనం, నాంది, ఇడాహవాచనం, బ్రహ్మకూర్చహోమం, పంచగవ్య ప్రాశనం, ఋత్విగ్వరణం, మధుపర్కవిధి వంటి వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.
ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రాం రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వేదాంత సేవలు, రక్షోమ్మ హోమం, బ్రహ్మోత్సవ అంకురార్పణ, సాయంతన పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం సభ్యులు భాగస్వాములయ్యారు. వారు వందలాది మంది భక్తులతో ఆలయానికి విచ్చేసి, అమ్మవారికి పట్టుచీరలు, పూజాద్రవ్యాలు సమర్పించి పూజలను నిర్వహించారు.
అలాగే, బ్రహ్మోత్సవాల ధ్వజారోహణకు సమర్పించిన ధ్వజపటాన్ని ఇంజనీరింగ్ విద్యార్థి శ్రీ గండ్రాతి వర్షక్ను రూపొందించి అందరి అభినందనలను పొందాడు.
ఈ రోజున కార్యక్రమం నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి & అసిస్టెంట్ కమీషనర్ శ్రీమతి శేషుభారతి, భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, పెండాల్స్, చల్లటి త్రాగునీరు, ఉచిత ప్రసాద వితరణ వంటి ఏర్పాట్లను చేశారు.
రేపు ఉదయం 11:00 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరుగనుండగా, 10 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు యావన్మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక