తెలంగాణ ధ్వని : తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నిజాంపేట్‌లో నివాసం ఉంటున్న ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లు వచ్చిన వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె రెండు రోజులుగా గదిలో ఉండిపోవడంతో కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. డోర్ తెరవకపోవడంతో మంగళవారం పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి డోర్ బద్దలు కొట్టాల్సి వచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఆస్పత్రి నుంచి హెల్త్ బులిటెన్ – కల్పన కోలుకుంటున్నా
నిజాంపేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్యంపై బుధవారం ఉదయం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. “కల్పన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నా, ఆమె వేగంగా కోలుకుంటున్నారు. కొన్ని గంటల్లోనే ఆమెను డిశ్చార్జ్ చేయగలమని భావిస్తున్నాం” అని తెలిపారు.
కల్పన అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకున్నట్లు సమాచారం. ఆస్పత్రికి చేరిన వెంటనే ఆమెకు స్టమక్ వాష్ చేసి, వెంటిలేటర్‌పై ఉంచినట్లు వైద్యులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల వివరణ – ఆత్మహత్యాయత్నం వార్తలు అవాస్తవం
ఈ వ్యవహారంపై కల్పన పెద్ద కూతురు దయ ప్రసాద్ కేరళ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చి, ఆస్పత్రిలో తల్లి ఆరోగ్యాన్ని తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, “తన తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది అనే వార్తలు అవాస్తవం. కుటుంబ కలహాల వల్ల టాబ్లెట్లు మింగిందన్న వార్తలు అసత్యం. ఆమె గాయని మాత్రమే కాకుండా, పీహెచ్డీ, ఎల్‌ఎల్‌బీ చదువుతున్నారు. ఒత్తిడి కారణంగా వైద్యులు ఇన్సోమ్నియా టాబ్లెట్లు రాశారు. అవి ఓవర్‌డోస్ కావడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లారు” అని స్పష్టం చేశారు.కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవని, తల్లిపై అసత్య ప్రచారం చేయొద్దని దయ ప్రసాద్ మీడియాను కోరారు. పోలీసులు కూడా కల్పన స్టేట్‌మెంట్ రికార్డు చేయగా, ఆమె ఒత్తిడి వల్ల మాత్రలు ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక