telanganadwani.com

SimhachalamAccident

సింహాచలం ఆలయంలో గోడ కూలిన విషాదం – ఏడుగురు భక్తుల మృతి…

తెలంగాణ ధ్వని : విశాఖపట్నంలోని ప్రముఖ సింహాచలం అప్పన్న ఆలయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతోంది.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కమిటీ నివేదికను ఈ రోజు సాయంత్రం ప్రభుత్వానికి సమర్పించనుంది. విచారణలో ఆలయ అధికారులు, టూరిజం శాఖ ఇంజినీర్లు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు వెల్లడైంది. ఆగమశాస్త్రం, వైదిక నియమాలను పక్కనపెట్టి అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

పండితులు ఇచ్చిన సూచనలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని కమిటీ అభిప్రాయపడింది. తరతరాలుగా ఉన్న సొరంగ మార్గాన్ని మూసివేసి దానిపై గోడ నిర్మించడం ప్రమాదానికి దారి తీసింది. మూడు నెలల కిందటే ఈ మార్గాన్ని కూల్చివేసి రోడ్డు నిర్మించారని తేలింది. సదరు గోడ కూలిపోవడం వల్లే భక్తులు మృతి చెందినట్లు స్పష్టం అయింది.

ఆలయ పండితుల హెచ్చరికలను పరిగణలోకి తీసుకోకపోవడం అధికారుల వైఫల్యంగా చూస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టడమే ఈ దుర్ఘటనకు కారణమని కమిటీ స్పష్టం చేసింది. నివేదిక సమర్పణతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయాల్లో నిర్మాణాలకు ముందు వైదిక పరిపాటులను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అన్ని ఆలయాల్లో భద్రతా జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

రిపోర్టర్.ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top