తెలంగాణ ధ్వని : రాజన్న సిరిసిల్ల చేనేత రంగంలో తన అద్భుత సృజనాత్మకతను ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు యెల్ది హరిప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. చేనేత కళారంగంలో వినూత్న ప్రయోగాలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హరిప్రసాద్‌కు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
చేనేత రంగంలో కొత్త ఒరవడి
హరిప్రసాద్ తన చేనేత నైపుణ్యంతో పలురకాల వినూత్న ప్రాజెక్టులను రూపొందించారు. బుల్లి మరమగ్గాలు, రాట్నాలు, అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర, వెండి, బంగారు చీరలు, దబ్బునం లోంచి దూరే చీర వంటి ప్రత్యేకమైన చేనేత వస్త్రాలను రూపొందించారు. అంతేకాదు, చేనేత మగ్గంపై ప్రముఖుల ముఖచిత్రాలను అద్భుతంగా నేసి దేశవ్యాప్తంగా తన ప్రతిభను చాటారు.
ప్రధాని మోడీ ప్రశంసలు
హరిప్రసాద్ తన అద్భుతమైన కళా నైపుణ్యంతో వస్త్రంపై G-20 లోగోను నేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ ప్రత్యేకమైన కళాకృతి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించడంతో పాటు, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.
డాక్టరేట్‌తో గౌరవించిన యూనివర్సిటీ
చేనేత రంగానికి చేసిన కృషిని గుర్తించి, ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసర్చ్ యూనివర్సిటీ హరిప్రసాద్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని పొందడం పట్ల హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.
అభినందనలు వెల్లువ
హరిప్రసాద్ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఆయనను కుటుంబసభ్యులు, సిరిసిల్ల వాసులు, చేనేత కార్మికులు, పలువురు ప్రముఖులు అభినందించారు. చేనేత రంగాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించే విధంగా హరిప్రసాద్ చేసిన కృషి మరింత ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టర్. అభిలాష్