తెలంగాణ ధ్వని : వరంగల్ నగరంలోని కాశిబుగ్గలో ఉన్న సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో అనధికార వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ/పీఎంపీ గుర్రం సదానందంపై శనివారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు నిర్వహించింది. ఆయన్ను నకిలీ వైద్యుడిగా గుర్తించారు. ఆయన వైద్య విద్యలేకుండా హై డోస్ యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తుండడాన్ని అధికారులు పట్టించారు. అలాగే ఫార్మసీ లైసెన్స్ లేకుండా మందుల నిల్వలు కూడా గుర్తించారు. దీనిపై అధికారిక ఫిర్యాదు డా. డి. లాలయ్య కుమార్, డా. కె. మహేష్ కుమార్ లు ఇంతేజర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో చేశారు. ఎన్‌ఎంసీ చట్టం సెక్షన్లు 34, 54, టీఎస్‌ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. నరేష్ కుమార్ ప్రకారం, ఆర్ఎంపీలు, పీఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్సకే పరిమితమవలసినవారు. కానీ గుర్రం సదానందం అనధికారంగా మందులు ఇస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాడు. ఇది ప్రజల ప్రాణాలతో ఆటలాడటమేనని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్న, విద్యావంతులైన వైద్యులను మాత్రమే సంప్రదించాలని ప్రజలకు సూచించారు. నకిలీ వైద్యుల సేవలు తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి నకిలీ వైద్యులపై అప్రమత్తంగా ఉండాలి. నకిలీ వైద్యులపై ఫిర్యాదు చేయాలనుకుంటే వాట్సాప్ 91543 82727 ద్వారా లేదా antiquackerytsmc@onlinetsmc.in కి ఇమెయిల్ చేయవచ్చు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డా. జి. శ్రీనివాస్ ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక