- ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి
- పోషణ పక్షం ముగింపు కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య
- జిల్లా కలెక్టరేట్ లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాలు
- వేడుకలో నృత్యాలతో అలరించిన ప్రీ స్కూల్ చిన్నారులు
- చిన్నారులకు బారాసాల, అక్షరాభ్యాసం, గ్రాడ్యుయేషన్ డే, కార్యక్రమాలు
- గర్భిణులకు సామూహిక సీమంతం
- ఆడ పిల్లలకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకు ఘన స్వాగతం.
తెలంగాణ ధ్వని : ఐదేళ్ల లోపు చిన్నారులకు, గర్భిణీలు, బాలింతలు పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణా పక్షం కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారి జె. జయంతి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలంటే జిల్లాలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రణాళికబద్ధంగా లబ్ధిదారులకు అందాల్సిన సేవలు సకాలంలో అందించాలని, లోపపోషణ లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు.
అంగన్వాడీ కేంద్రం ద్వారా అనుబంధ పోషకాహారం, ఆరోగ్యం, పోషకాహార విద్య, ప్రీస్కూల్ విద్య, రోగనిరోధకత, రెఫరల్ సేవలు,ఆరోగ్య పరీక్షలు తదితర సేవలు అందుటకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
పోషణ పక్వాడ 2025 ఉద్దేశాలకనుగుణంగా మొదటి వంద రోజులపై దృష్టి సారించాలని, గర్భిణీ దశ నుండి పుట్టిన బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు 1000 రోజులుగా పరిగణించబడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా జాతీయ బాలిక దినోత్సవం రోజున (జనవరి 24)
ఆడ పిల్లలకు జన్మ నిచ్చిన ఐదుగురు చిన్నారులను వారి తల్లి తండ్రులకు తివాచి పరచి ఘనంగా స్వాగతించి కలెక్టర్ ఆధ్వర్యంలో సన్మానించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, ఆన్న ప్రాసన, గర్భిణీలకు సీమంతం కార్యక్రమాల్ని నిర్వహించారు, ప్రీస్కూల్ పూర్తిచేసుకున్న చిన్నారులకు కాన్వోకేషన్ తదితర కార్యక్రమాలు, సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆరుగురు లబ్ధిదారులకు పోస్టాఫీసు పాస్ పుస్తకాలను అందచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్జేడీ ఝాన్సి లక్ష్మి బాయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఆయుష్ వైద్యులు డాక్టర్ మహేందర్, జిల్లా న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ సరళ, సిడీపీఓ లు విశ్వజ, స్వరూప, స్వాతి, పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ టీ సుమలత, జిల్లా మిషన్ శక్తి కో ఆర్డినేటర్ డి కళ్యాణి, సీనియర్ అసిస్టెంట్ వి.వెంకట్రాం, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జి అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్ ఐసీడిఎస్ సూపర్వైజర్లు, టీచర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక