బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు భారీ ఏర్పాట్లు
హన్మకొండలో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ
తెలంగాణ ధ్వని : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ముఖ్యంగా, ఈ సభ ద్వారా ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించి, పార్టీ బలాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
1200 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం
బీఆర్ఎస్ నేతలు సభ కోసం దాదాపు 1200 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. చింతలపల్లి, దామెర శివారులోని స్థలాన్ని ఎంపిక చేసి, అక్కడి రైతుల నుండి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ కూడా పొందారు. బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, వొడితెల సతీష్ బాబు ఇప్పటికే సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
పది లక్షల జన సమీకరణ లక్ష్యం
ఈ సభకు దాదాపు 10 లక్షల మంది ప్రజలను సమీకరించాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు కలిపి 40 నుంచి 50 వేల వరకు రాకపోకలు నిర్వహిస్తాయని అంచనా.
సభకు విస్తృత ఏర్పాట్లు
- విఐపీ & సాధారణ ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు
- పదిలక్షల వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
- భద్రతా ఏర్పాట్లకు ప్రత్యేక కమిటీలు
- బహిరంగ సభ ప్రాంగణానికి రోడ్ల అభివృద్ధి
పార్టీ శక్తి ప్రదర్శన లక్ష్యం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సభ ద్వారా పార్టీ సత్తా చాటాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా సభకు వచ్చే ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని నేతలు శ్రద్ధ వహిస్తున్నారు. సమగ్ర ప్రణాళికతో బీఆర్ఎస్ నేతలు రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక