telanganadwani.com

14 మందిని కాపాడిన అంధుడు.. సీఎం ప్రశంసలు

తెలంగాణ ధ్వని: ప్రస్తుత కాలంలో దివ్యాంగులు సైతం అన్ని రంగాలలో తమ సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు పుట్టుకతో దివ్యాంగులైన వారు తమ జీవితం ఇంతేనని, తామేమీ చేయలేమని ఒక నిస్సహాయ జీవనాన్ని గడిపేవారు. ప్రస్తుతం కాలం మారింది. పుట్టుకతోనో, ప్రమాదవశాత్తునో మానసిక, శారీరకంగా దివ్యాంగులైన వారు విద్య, ఉద్యోగం, కళారంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారు. సామాన్య మానవులకు తాము ఏమాత్రం తీసిపోమని రుజువు చేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ అంధుడు ఏకంగా 14 ప్రాణాలను కాపాడి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

బీహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లా దుమ్‌దుమా గ్రామానికి చెందిన భుల్లు పుట్టుకతోనే అంధుడు. అయితే విచిత్రంగా భుల్లు నీటిలో దిగగానే అతనికి దృష్టి వస్తుంది. చక్కగా చూడగలుగుతాడు. ఈ ప్రత్యేకతతో భుల్లు…. బాయా నది, ఇంకా ఇతర చెరువుల్లో మునిగిపోయిన 14 మందిని ప్రాణాలతో కాపాడాడు. అలాగే 13 మంది మృతదేహాలను సైతం వెలికి తీశాడు. అతడి ప్రతిభను గుర్తించి.. బిహార్‌ పోలీస్‌ వారోత్సవాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రశంసాపత్రం, రూ.10 వేల నగదు అందజేశారు. భుల్లు నేలపై ఉన్నపుడు తానేదీ చూడలేనని, నీటిలోకి దిగితే మాత్రం తన కళ్లు మెరుస్తాయని, అన్నీ స్పష్టంగా కనిపిస్తాయని చెబుతాడు. భుల్లు నీటిలో చూడగలగడంపై కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ లాల్‌బాబుషా మాట్లాడుతూ.. గాలి, నీటి వక్రీభవన గుణకాలు (Refractive indices ) భిన్నంగా ఉండటమే దీనికి కారణమై ఉంటుందని చెప్పారు.

రిపోర్టర్: జవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top