telanganadwani.com

#BandiSanjay

2. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు కోసం కాంగ్రెస్-బీఆర్ఎస్ మద్దతు – బండి సంజయ్ ఆరోపణ

తెలంగాణ ధ్వని : బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి గెలుపు అందించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరిస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓట్లు ఉన్నప్పటికీ, ఎంఐఎంతో ఉన్న పొత్తు కారణంగా పోటీ చేయడం లేదని తెలిపారు. ఎంత మంది కలిసినా బీజేపీ ప్రభంజనాన్ని ఆపలేరని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలో సన్న బియ్యానికి రూ.40 భరిస్తోందని, ఈ పథకానికి ఏడాదికి రూ.10 వేల కోట్లు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తమదిగా ప్రకటించుకోవడం అన్యాయం అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమలవుతున్న పథకాలపై ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలు ఇంకా పెండింగులో ఉండగానే ఫలితాలు ఎలా ప్రకటించారని నిలదీశారు. నియామక పత్రాలు పంపిణీపై హడావిడి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యువత భవిష్యత్తుతో ఆడుకోవడాన్ని బీజేపీ సహించదని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ పట్ల పెరుగుతున్న ప్రజాధరణను చూసి ఇతర పార్టీలు కలిశాయన్న ఆరోపణలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలను నమ్మబోరని, వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందని, మిగతా పార్టీలు మాత్రం తమ స్వార్థ రాజకీయాల్లో నిమగ్నమై ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు నిజానిజాలను గ్రహించి బీజేపీకి మద్దతు తెలపాలని కోరారు. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో బండి సంజయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top