telanganadwani.com

BirdFlu
  • బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్‌ల చుట్టూ మూడు కిలోమీటర్ల వరకు “కంటైన్‌మెంట్ జోన్” గా ప్రకటించారు.
  • ఈ జోన్‌లో కోళ్ల రవాణా, విక్రయాన్ని పూర్తిగా నిషేధించారు.
  • స్థానిక ప్రజలు కోళ్ల మాంసం, గుడ్లు తినే విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
  • అనుమానాస్పదంగా కోళ్లు మరణించినా, వెంటనే పశువైద్య అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

తెలంగాణ ధ్వని : తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. కొద్ది రోజుల క్రితం కాస్త తగ్గినట్లు కనిపించిన ఈ మహమ్మారి ఇప్పుడు తిరిగి వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు బర్డ్ ఫ్లూ ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలో ఉన్న ఓ కోళ్ల ఫారంలో వందలాది కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశువైద్యాధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిన తర్వాత, బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగానే ఈ మృతులు సంభవించినట్లు నిర్ధారణ అయ్యింది.

ఈ నేపథ్యంలో, వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు అక్కడి అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం దాదాపు 40,000 కోళ్లు నిర్వీర్యం చేసి సంచుల్లో ప్యాక్ చేసి పూడ్చివేశారు. అంతేకాకుండా, ఆ కోళ్ల ఫామ్‌లో ఉన్న 20,000 కోడిగుడ్లు, పక్షుల వ్యర్థాలను కూడా నాశనం చేశారు. కోళ్లకు సంబంధించిన దాణాను సీజ్ చేశారు.

ఇక తాజాగా, నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓ భారీ కోళ్ల ఫారంలో కూడా బర్డ్ ఫ్లూ విజృంభించింది. ఈ ఫామ్‌లో రెండు లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయి. గత మూడు రోజులుగా అక్కడ కోళ్లు అకస్మాత్తుగా మరణిస్తుండటంతో అధికారులకు అనుమానం వచ్చి, వెంటనే శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు ధృవీకరణ కావడంతో, మిగిలిన కోళ్లను కూడా నిర్వీర్యం చేయాలని నిర్ణయించారు.

రిపోర్టర్. అనూష 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top